రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు రాజేసి లబ్ది పొందాలని గోతికాడి గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నారు.
ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయనున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇది ప్రత్యక్షం కాగానే ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
ఒకవైపు స్థానిక ఎన్నికల హడావుడి నెలకొన్న సమయంలో “డిప్యూటీ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్ " పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఫేక్ వాట్సాప్ ఛానెల్‌ను సృష్టించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి, తన శాఖలకు త్వరలో రాజీనామా చేయబోతున్నారని, కొన్ని రోజుల్లో ఈ విషయం పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. ఇది చూసిన జనసైనికులు, టీడీపీ శ్రేణులు ఉలిక్కి పడ్డారు. మీడియా ప్రతినిధులు పరుగులు పెట్టారు.
ఈ హడావుడి అంతా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం దృష్టిలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన ఈ ప్రచారాన్ని కొట్టి పడేసింది. ఇదంతా అబద్దమని తీవ్రంగా ఖండించింది. అసలు డిప్యూటీ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్ అనే వాట్సాప్ ఛానెల్ ఏదీ లేదని స్పష్టం చేసింది. సదరు వాట్సాప్ లింక్ తమ అధికారిక ఛానెల్ కాదని స్పష్టం చేసింది. ప్రజలను, జనసైనికులను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి సంబంధం లేని కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ తప్పుడు ప్రచారాన్ని జనసేనతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ప్రచారం మీద సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ నకిలీ సందేశాలను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్న ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ విష ప్రచారం వెనుక ప్రతిపక్ష వైసీపీ కుట్ర ఉండవచ్చని జనసేన శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ ముఠా ఆట కట్టించాలని కోరుతున్నారు.

