బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం మేరకు మొత్తం నాలుగు రోజులకు గాను 140 నుంచి 150 కోట్ల మధ్యలో గ్రాస్ నమోదయ్యింది.
నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టాక్ కి భిన్నంగా నిన్న మెయిన్ సెంటర్స్ దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. ముఖ్యంగా నైజామ్ నుంచి బలమైన మద్దతు దక్కడంతో హైదరాబాద్ తో సహా పలు చోట్ల భారీ నెంబర్లు వస్తున్నాయి.
ఇక్కడిదాకా బాగానే ఉంది. ఎలాంటి పోటీ లేకపోవడం, వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ తప్ప ఇంకే ఆప్షన్ కనిపించకపోవడం వల్ల వసూళ్లు ఇంత స్టడీగా ఉన్నాయనే కామెంట్ ని కొట్టిపారేయలేం. దానికి తోడు నాని సృష్టించుకున్న బ్రాండ్, తను ఎంచుకున్న జానర్ ఏదైనా ఒకసారి థియేటర్లో చూడాలనే ప్రేక్షకుల నమ్మకం వెరసి కలెక్షన్లు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయి. అలాని టాక్ అమాంతం మారిపోలేదు కానీ ఉన్నంతలో కొంత మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది.
అసలు పరీక్ష ఇకపై ఉంది. ఇవాళ సోమవారం నుంచి తిరిగి ఇంకో వీకెండ్ వచ్చేదాకా ఆక్యుపెన్సీలు ఎంత మేరకు డ్రాప్ అవుతాయనే దాని మీద ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర సైడ్ కొంచెం వీక్ గా ఉందని, ఇది మరింతగా తగ్గే ప్రమాదం ఉందని బయ్యర్ వర్గాలు అనుమాన పడుతున్నాయి. పబ్లిసిటీ పరంగా నాని టీమ్ అంతా చేసింది. రిలీజ్ తర్వాత మీడియాతో మీట్ నిర్వహించడంతో పాటు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా విడుదల చేశారు. యుఎస్ లో ఆల్రెడీ రెండు మిలియన్లు దాటేసింది.
ఒకవేళ ప్యారడైజ్ కనక దూకుడు కొనసాగిస్తే సూపర్ హిట్ స్టాంప్ పడిపోతుంది. ఎంత శాతం డ్రాప్ అనేది కీలకం కానుంది. పాజిటివ్ విషయం ఏమిటంటే జనాలకు థియేటర్ ఆప్షన్లు లేకపోవడం. ఒకవేళ నానికి ఎవరైనా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండి ఉంటే ఎలా ఉండేదో కానీ ఇప్పటికైతే సోలో రన్ ఎంజాయ్ చేయడంలో టీమ్ బిజీగా ఉంది. టాక్ తాలూకు ప్రభావం నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ఉందా లేదానేది కూడా ఇవాళ నమోదయ్యే నెంబర్లలో బయట పడుతుంది. చూద్దాం నాని ఏమేరకు ఫుల్ చేయబోతున్నాడో.

