కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ రాజుకున్నా సరే అందులో పెట్రోల్ పోసేందుకు ఆ పార్టీ నేతలు రెడీగా ఉంటారు.
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సీట్ల పంపకాలలో ఇరు పార్టీల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న విభేదాలను వైసీపీ ఏ రేంజ్ లో క్యాష్ చేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే జనసేన నేతలను రెచ్చగొట్టేలా వైసీపీ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు జనసేన కావాలని, ఎన్నికలొస్తే మావోళ్లు కావాలి అన్న రీతిలో టీడీపీ నేతల ప్రవర్తన ఉందని అంబటి విమర్శించారు. ఎన్నికలొస్తే జనసేన వాళ్లు పారిపోవాలా? అని ప్రశ్నించారు. అయితే, అది కూటమి పార్టీల ఇంటర్నల్ వ్యవహారం అని, జనసేన కార్యకర్తలు ఊడిగం చేస్తానంటే చేసుకోవచ్చని, తనకేం అభ్యంతరం లేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన నేతలను భుజాల మీద ఎక్కించుకుంటారా? జనసేన నేతలకు, కార్యకర్తలకు అధికారం ఇవ్వాల్సి వస్తే పారిపోతారా? అని ప్రశ్నించారు.
ఏపీలో చంద్రబాబు, లోకేశ్.. ఇద్దరే నాయకులున్నారని, మరొకరు లేరని పరోక్షంగా పవన్ ను నాయకుడు కాదని వ్యాఖ్యానించారు అంబటి. పవన్ కల్యాణ్ ను డమ్మీ చేశారా అని మీడియా ప్రతినిధులు అంబటిని ప్రశ్నించారు. అయితే, తాను పవన్ గురించి కామెంట్ చేయనని అన్నారు. ఏపీలో చంద్రబాబు, లోకేశ్ ల పాలనే కానీ, మరొకటి లేదని చెప్పారు. తనకు తెలియక అడుగుతున్నానని…జనసేనకు ఎన్నిచ్చారు అని ప్రశ్నించారు.
ఇక, తాను బెదిరించేది పోలీసులనని అంబటి అన్నారు. చట్టబద్ధంగా వ్యవహరించకపోతే…జగన్ సీఎం అయిన తర్వాత మొదటి 6 నెలలు తాను హోం శాఖను అడిగి తీసుకుంటానని, తప్పు చేసిన పోలీసులు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తానని అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరో. పిచ్చయ్య చౌదరో…తాను రప్పా రప్పా నేత అంటున్నారని, కానీ, తాను రప్పా రప్పా నేత అయితే తన ఇంటి మీద దాడి చేయనిస్తానా?….వైసీపీ నేతల నామినేషన్లు అడ్డుకుంటుంటే ఊరుకుంటానా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొదట రోడ్ల మీదకు వచ్చింది జనసేన కార్యకర్తలే అని కొద్ది రోజుల క్రితం పవన్ చేసిన కామెంట్ల ఆధారంగానే అంబటి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. అందుకే, పవన్ కానీ, కూటమికి చెందిన మరే నేతగానీ ఆ తరహా వ్యాఖ్యలు చేసేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే ఇలా వైసీపీ నేతల చేతికి స్వయంగా అస్త్రాలు అందించినట్లవుతుంది.

