Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవిత జైలుకెళ్తే. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా?

కవిత జైలుకెళ్తే. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా?

Gulte.com 6 days ago

పోస్కో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కొడుకు చేసిన తప్పునకు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి.

ఈ మేరకు సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘాటుగా స్పందించారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళితే… కేసీఆర్, కేటీఆర్ లు తమ పదవులకు రాజీనామా చేశారా? అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీశాయి.

బండి ఫ్యామిలీ, బీజేపీ అధిష్ఠానంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై సోమవారం స్పందించిన రాంచందర్ రావు… బీఆర్ఎస్ నేతల తీరును తప్పుబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా…బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ కుమార్తె, నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగిన కవిత దేశ రాజధానిలో లిక్కర్ దందా నడిపి అడ్డంగా బుక్కయ్యారని ఆయన గుర్తు చేశారు.

నాడు కవితను పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించిన విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మరి నాడు కుమార్తె కవిత చేసిన తప్పునకు బదులుగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. సోదరి చేసిన తప్పునకు ప్రతిగా కవిత సోదరుడు కేటీఆర్ తన పదవికి రాజీనామా చేశారా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు.

ఇక బండి భగీరథ్ విషయానికి వస్తే… ఈ కేసులో తన తప్పేమీ లేదని భగీరథ్ చెబుతున్నారని, ఈ కేసులో విచారణ పూర్తి అయితేనే తప్పించి అసలు జరిగింది ఏమిటో తెలియదని రాంచందర్ రావు అన్నారు. మైనర్ బాలికను వేధించారని తనపై పోస్కో కేసు నమోదు కాగా… బాధ్యత కలిగిన పౌరుడిగా భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆయన తెలిపారు. అయినా భగీరథ్ చేసినట్లుగా ఆరోపిస్తున్న తప్పునకు బండి సంజయ్ ఎలా బాధ్యుడు అవుతారని కూడా ఆయన ప్రశ్నించారు.

బీజేపీ ఓ నిబద్ధత కలిగిన పార్టీ అని రాంచందర్ రావు చెప్పారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా, వారు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా తదనుగుణంగా చర్యలు ఉంటాయని ఆయన పునరుద్ఘాటించారు. బండి సంజయ్ పాత్ర ఈ వ్యవహారంలో లేనే లేదని ఆయన చెప్పుకొచ్చారు.

భగీరథ్ కూడా రాజ్యాంగం తనకు కల్పించిన హక్కుల మేరకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఏ ఒక్కరి కోసమో మార్చబడదని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు తెలుసుకుని మసలుకుంటే అందరికీ మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu