Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణం, హాజరు కాని విజయ్!

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణం, హాజరు కాని విజయ్!

Gulte.com 6 days ago

కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ ఆర్.వి.

ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు.

భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు, వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీశన్‌తో పాటు 20 మంది మంత్రులతో కూడిన కొత్త కేబినెట్‌ కూడా ఒకేసారి ప్రమాణస్వీకారం చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. గత వారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ మిత్రపక్షం విజయ్ కూడా వస్తారని అభిమానులు ఆశించారు కానీ ఆయన మాత్రం హాజరు కాలేదు. కారణాలేంటి తెలియాల్సి ఉంది.

ఎర్నాకుళం జిల్లా నెట్టూరుకు చెందిన సతీశన్‌.. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అప్పటి నుంచి వరుసగా ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా పనిచేసిన సమయంలో ప్రభుత్వంపై దూకుడైన పోరాటం చేస్తూ పార్టీకి కీలక నాయకుడిగా ఎదిగారు.

ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేరళలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కొత్త ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని సతీశన్‌ ప్రమాణస్వీకారం అనంతరం పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu