Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా.?

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా.?

Gulte.com 1 week ago

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అదికారంలో ఉండగా… ఫార్ములా ఈ రేసు కార్ల పేరిట భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

తాజాగా ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు… జూలై 31న హాజరు కావాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కేటీఆర్ కోర్టు విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్ కు విశ్వవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కేలా చేస్తామంటూ చెప్పిన బీఆర్ఎస్ సర్కారు.. అందులో భాగంగా నగరంలో ఫార్ములా ఈ కారు రేసులను నిర్వహించింది. ఇందుకోసం కారు రేసుల సంస్థకు రూ.55 కోట్లను చెల్లించింది. ఈ మొత్తాన్ని విదేశాల్లోని సదరు సంస్థకు చెల్లించేందుకు మరో రూ.10 కోట్ల మేర ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ నిధులు కేటీఆర్ ఆధ్వర్యంలోని పురపాలక శాఖ నుంచే వెళ్లాయి. దీంతో కేటీఆర్ తో పాటు నాడు హెచ్ఎండీఏ చీఫ్ గా కొనసాగిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంచిజీన్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు ఈ కారు రేసుల సంస్థలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.

ఈ కేసు విచారణల కోసం కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ అదికారుల ముందు హాజరయ్యారు. విడతలవారీగా జరిగిన ఈ విచారణల్లో అధికారులు అడిగిన అన్నిప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానంటూ విచారణల అనంతరం కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక అరవింద్ కుమార్ తో పాటు బీఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు.

ఈ విచారణల అనంతరం విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా ఏసీబీ అధికారులు ఇటీవలే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో తానెలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏమీ లేదంటూ ఆయన ఇదో లొట్టపీసు కేసు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. విదేశీ సంస్థకు నిధులు పంపిన మాట వాస్తవమేనని చెబుతున్న కేటీఆర్… తామేమీ రహస్యంగా ఆ సంస్థకు డబ్బులు చెల్లించలేదని, నిబంధనల మేరకే డబ్బు పంపామని వాదిస్తున్నారు.

అయితే ఇలా విదేశీ సంస్థలకు సర్కారీ సొమ్మును పంపే విషయంలో కేటీఆర్, నాడు సంబంధిత శాఖ అదికారులు నిబంధనలను పాటించలేదన్నది ఏసీబీ వాదన. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ ను కోర్టు విచారణకు స్వీకరించిందంటే… ఈ కేసులో ఎంతో కొంత నేరముందన్న అబిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu