Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంచు కోడలి పోటీ. పార్టీ. ప్లేస్. ఎక్కడ?

మంచు కోడలి పోటీ. పార్టీ. ప్లేస్. ఎక్కడ?

Gulte.com 5 days ago

భూమా ఫ్యామిలీకి రాజకీయాల్లో మంచి గుర్తింపే ఉంది. అయితే దివంగత భూమా నాగిరెడ్డి మరణానికి ముందే… ఆయన సతీమణి భూమా శోభా నాగిరెడ్డి మరణించడం ఆ కుటుంబాన్ని రాజకీయంగా పెద్ద దెబ్బే కొట్టింది.

అయితే భూమా వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిల ప్రియారెడ్డి అనతికాలంలోనే తిరిగి పుంజుకోగలిగారు. తాజాగా ఆ కుటుంబం నుంచి మరో నేత ఎంట్రీకి రంగం సిద్ధమైంది. భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఆమె భర్త, టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు.

మనోజ్ ప్రకటనతో భూమా మౌనిక రాజకీయ ప్రస్థానంపై అప్పుడే పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలయ్యాయి. అసలు భూమా మౌనికా రెడ్డి గానీ, ఆమె భర్త మనోజ్ గానీ ఏ పార్టీలో ఉన్నారంటూ చాలా మంది ఆరా తీస్తుండగా… వచ్చే ఎన్నికల్లో భూమా మౌనికా రెడ్డి పోటీ చేస్తే…ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయాలపై ఆసక్తిరకర చర్చలు సాగుతున్నాయి. తాము ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నామంటూ మనోజ్ చేసిన ప్రకటన కూడా ఈ చర్చలను మరింత ఆసక్తిగా మార్చివేశాయని చెప్పక తప్పదు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి కేంద్రంగా వ్యవహారం నడుపుతున్న మనోజ్… స్థిర నివాసాన్ని మాత్రం హైదరాబాద్ లో కొనసాగిస్తున్నారు. మౌనిక కూడా ఆయనతో పాటే హైదరాబాద్ లో ఉంటోంది. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదంలో భాగంగా మనోజ్ టీడీపీ మద్దతు తీసుకునే దిశగా సాగారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ తో పలుమార్లు భేటీ అయ్యారు కూడా. ఈ క్రమంలో ఇప్పటికే తాము రాజకీయాల్లో ఉన్నామని మనోజ్ చెప్పిన నేపథ్యంలో వారు టీడీపీలో ఉన్నట్టుగానే పరిగణించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి..

ఇక భూమా మౌనిక సోదరి అఖిలప్రియ ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డలో మౌనికా రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక తమ తండ్రి భూమా నాగిరెడ్డి ఓ దఫా నంద్యాల ఎమ్మెల్యేగానూ గెలిచారు. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన మరణించారు.

ఆ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికలో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ను మాత్రమే భూమా ఫ్యామిలీకి ఇచ్చిన టీడీపీ… నంద్యాల టికెట్ ను పార్టీ సీనియర్ మోస్ట్ నేత ఎన్ఎండీ ఫరూక్ కు ఇచ్చింది. ఈ లెక్కన ఇటు నంద్యాలలోనూ మౌనికా రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవనే చెప్పాలి.

మరి పుట్టిల్లు నంద్యాల జిల్లా కాకుండా భూమా మౌనికారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మెట్టినిల్లు తిరుపతి జిల్లా విషయానికి వస్తే… మోహన్ బాబు ఫ్యామిలీ, వారి విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతున్న రంగంపేట చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మరి చంద్రగిరి నుంచి మౌనికా రెడ్డి పోటీ చేస్తారా? అంటే… అక్కడ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని బలంగానే ఉన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఓడించిన నానిని పక్కనపెట్టే ఉద్దేశం టీడీపీకి లేదనే చెప్పాలి.

ఇక మంచు ఫ్యామిలీ సొంతూరు ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మౌనికా రెడ్డి పోటీ చేస్తారా? అంటే… అదేమో దివంతగ నేత, మాజీ మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

మౌనిక కోసం సుధీర్ రెడ్డి తప్పించడనేది దాదాపుగా దుస్సాధ్యమేనని చెప్పాలి. మరి మౌనికా రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది అంతు చిక్కడం లేదు. అయినా ఏదో ఒక నియోజకవర్గమో, జిల్లానో ఎంచుకోకుండా… మౌనికా రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ మనోజ్ ఎలా ప్రకటించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu