Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నడి రోడ్డుపై పావలా శ్యామల

నడి రోడ్డుపై పావలా శ్యామల

Gulte.com 1 week ago

చేసినవి చిన్న చిన్న పాత్రలే అయినా.. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న లేడీ కమెడియన్లలో పావలా శ్యామల ఒకరు. చాలా ఏళ్ల పాటు వందల సినిమాల్లో నటించినా..

ఆమెవన్నీ చిన్న పాత్రలే కావడంతో పెద్దగా సంపాదించుకోలేదు. పైగా చాలా ఏళ్ల కిందటే తీవ్ర అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతుండడంతో చేతిలో ఉన్నదంతా కరిగిపోయింది.

పావలా శ్యామలతో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్యం బారిన పడడంతో విషయం తెలిసి.. పవన్ కళ్యాణ్‌, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సాయం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవల పెద్దగా వార్తల్లో లేని శ్యామల దయనీయ స్థితిలో రోడ్డు పక్కన కనిపించడం అందరినీ కలచి వేసింది.

పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన ఆమె.. ఇలాంటి పరిస్థితిలో కనిపించడం షాక్‌కు గురి చేసింది. తాజాగా పావలా శ్యామలకు గుండె సంబంధిత సమస్య తీవ్రమై హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ ఎక్కువ సమయంలో చికిత్స పొందలేని పరిస్థితుల్లో వెనక్కి మళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒక క్యాబ్ ఎక్కగా.. ఆమె ఎక్కడ తీసుకెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఆ డ్రైవర్ వై జంక్షన్ దగ్గర దింపేసి వెళ్లిపోయాడట.

అర్ధరాత్రి రోడ్డు పక్కన దయనీయ స్థితిలో ఉన్న పావలా శ్యామలను గుర్తించిన స్థానికులు ఆమెకు సాయం చేసే ప్రయత్నం చేశారు. ఆర్కే ఫౌండేషన్ అనే సంస్థకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల సూచన మేరకు సనత్ నగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన చికిత్స అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వాళ్లతో మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్ నుంచి సాయం అందుతున్నట్లు పావలా శ్యామల చెప్పారట. శ్యామలకు ఈ పరిస్థితి ఎదురైన విషయం తెలిసి అల్లు అర్జున్ టీం వెంటనే స్పందించినట్లు కూడా తెలుస్తోంది. మీడియాలో వార్తలు రావడంతో సినీ రంగం నుంచి మరింత మంది శ్యామలకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu