Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి. ఏం జరిగింది?

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి. ఏం జరిగింది?

Gulte.com 1 hr ago

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల ఏం జరిగిందనే అనుమానాలు మొదలయ్యాయి.

మృతులను 24 ఏళ్ల ప్రభాకర్ ధనివరి, 18 ఏళ్ల భావిక్ దేశాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ విషవాయువు పీల్చడం వల్ల చనిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

గోరేగావ్ తూర్పులోని రామమందిర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లో ఈ ఘటన జరిగింది. నిమజ్జనం సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన వీరు ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన వారి వెంట ఉన్నవారు వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే బయటకు తీసుకొచ్చి వైద్య సహాయం అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

టాయిలెట్‌లో విషవాయువు ఎలా ఏర్పడిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మూసివున్న ప్రదేశంలో గ్యాస్ పేరుకుపోయిందా? డ్రైనేజీ లేదా సెప్టిక్ వ్యవస్థ నుంచి ప్రమాదకర వాయువులు వచ్చాయా? అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకే ప్రదేశంలో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో విషవాయువు కారణమై ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే పోస్టుమార్టం, ఇతర పరీక్షల తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణం తెలియనుంది.

పబ్లిక్ టాయిలెట్ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడి గాలి బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా, గతంలో ఇలాంటి సమస్యలు వచ్చాయా అనే వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu