Dailyhunt
పవన్‌కు నాని ఎప్పుడూ మద్దతే

పవన్‌కు నాని ఎప్పుడూ మద్దతే

Gulte.com 1 week ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇప్పటిదాకా రోడ్డు సదుపాయమే లేని ఎన్నో గిరిజన ప్రాంతాలకు కూడా ఆయన సంకల్పం వల్ల రహదారులు పడ్డాయి. ఎక్కువ ప్రచారం లేకుండా మరెన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు పవన్. తాజాగా ఆయన శాఖలో మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు.

గ్రామాలను పరిశుద్ధంగా ఉంచేందుకు గాను పంజాయితీరాజ్ శాఖ స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టింది. ఈ రథాలు గ్రామ గ్రామాన తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నాయి. సాధారణంగా పట్టణాల్లో మాదిరి పల్లెటూళ్లలో చెత్త సేకరణ ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్న పవన్.. పారిశుద్ధ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టారు. ఐతే జనాల్లో ఈ కార్యక్రమం పట్ల అవగాహన, ఆసక్తి పెంచేలా వినూత్న ఆలోచన చేశారు.

ఈ స్వచ్ఛ రథాల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఐతే ఎంత మొత్తంలో పొడి చెత్తను ఇస్తారన్నదాన్ని బట్టి.. బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తోంది ప్రభుత్వం. దీంతో జనాలు పోటీ పడి తమ ఇళ్లలో, ఊరిలో ఉండే వ్యర్థాలను తీసుకొచ్చి స్వచ్ఛ రథాలకు అందజేస్తున్నారు.

ఇలా ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 19 లక్షల కేజీల పొడి చెత్తను కొనుగోలు చేయడం ద్వారా రూ.3.32 కోట్ల విలువ గల నిత్యావసరాలను జనాలకు అందించింది ఏపీ సర్కారు. గ్రామాలను స్వచ్ఛంగా మార్చే ఈ కార్యక్రమానికి ప్రచారం పెంచడానికి టాలీవుడ్ స్టార్ హీరో నాని ముందుకు రావడం విశేషం.

ఈ కార్యక్రమాన్ని కొనియాడుతూ నాని ఒక వీడియో చేశారు. పవన్ చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని అభినందిస్తూ.. మన ప్రజల్లో వ్యర్థాల నిర్వహణ మీద అవగాహన పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు నాని. ప్రభుత్వం చేపడుతున్న ఒక మంచి కార్యక్రమం కోసం నాని లాంటి యంగ్ హీరో ముందుకు రావడాన్ని అందరూ కొనియాడుతున్నారు.

ఇప్పుడే కాదు, గతంలో చాలాసార్లు నాని పవన్ కు మద్దతుగా నిలిచాడు. ఎన్నికల సమయంలో పవన్ గురించి మొట్ట మొదటిసారి మద్దతు తెలిపింది కూడా నానినే. దీంతో పవన్ అభిమానులు ఫిదా అయిపోయి నానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

తన బాటలో మిగతా హీరోలు, హీరోయిన్లు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని.. ప్రభుత్వం కూడా వారిని మంచి పనుల ప్రచారం కోసం ఉపయోగించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu