Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి కోసం ప్రేమజంట ప్లాన్. చివరకు జైల్లోకి!

పెళ్లి కోసం ప్రేమజంట ప్లాన్. చివరకు జైల్లోకి!

Gulte.com 1 day ago

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ జంట డబ్బుల కోసం చేసిన పని చివరకు ఇద్దరినీ జైలుకు పంపించింది. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన వీళ్లకు ఎక్కడా పని దొరకలేదు.

పెళ్లి చేసుకోవడానికి చేతిలో డబ్బులు కూడా లేవు. దీంతో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే చోరీ చేసినా మూడు రోజులకే పోలీసులకు చిక్కారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నపు రెడ్డి దుర్గారమణారెడ్డి (23), తెంక వరలక్ష్మి (24) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నెల రోజుల క్రితం ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వచ్చి గుర్రంగూడ ప్రాంతంలో కలిసి ఉంటున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అక్టోబర్ 18న ఉదయం 6.04 గంటలకు హస్తినాపురంలోని వెంకటరమణ కాలనీ రాజరాజేశ్వరి ఆలయం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆలయంలో పనిచేసే అందుగుల రాములమ్మ (65) శుభ్రం చేసే పనిలో ఉన్నారు. అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో ఆమెను టార్గెట్ చేశారు. సాయం చేస్తున్నట్లు దగ్గరకు వెళ్లిన వరలక్ష్మి వృద్ధురాలిని పట్టుకుని నోరు మూసింది. వెంటనే రమణారెడ్డి ఆమె మెడలోని సుమారు 30 గ్రాముల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కున్నాడు. అనంతరం ఇద్దరూ యాక్టివా స్కూటర్‌పై పారిపోయారు.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులు వెళ్లిన మార్గాన్ని గుర్తించారు. మూడు రోజుల తర్వాత బుధవారం ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్‌లో ఓ నగల దుకాణం సమీపంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ చేసిన బంగారు పుస్తెలతాడుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ఇద్దరికీ గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు గుర్తించారు. పెళ్లి కోసం డబ్బులు లేకపోవడంతోనే ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu