Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎం పొదుపు మంత్రం. మహానాడుపై ఎఫెక్ట్?

పీఎం పొదుపు మంత్రం. మహానాడుపై ఎఫెక్ట్?

Gulte.com 1 week ago

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు చేరే కీలక వేదికగా దీన్ని భావిస్తారు.

ముఖ్యంగా లోకేష్‌ కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఈసారి వేడుకలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ నెల 27, 28 తేదీల్లోనే ప్రతినిధుల సభ నిర్వహించి కీలక తీర్మానాలు, రాజకీయ చర్చలను ముగించాలని పలువురు నేతలు సూచించినట్లు సమాచారం. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో మహానాడును ముగిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను కూడా అదే రోజు నిర్వహించి మహానాడును ముగించేలా సమాలోచనలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట ప్రతిపాదించినట్లుగా ఈ నెల 29న నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా ధనం, ఇంధన వినియోగం తగ్గింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే "పొదుపు చర్యలు పాటించాలంటే మహానాడు ఘనంగా నిర్వహించకూడదా?" అన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. మహానాడు అంటే కార్యకర్తల ఉత్సాహానికి ప్రతీక అని, దానిని పూర్తిగా కుదించడం సరైంది కాదని కొందరు నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది.

ఇంకొందరు మంత్రులు మాత్రం ప్రతినిధుల సభను రెండు రోజులకే పరిమితం చేసి, బహిరంగ సభను నిర్వహించకుండా ఉంటే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని మంత్రి లోకేష్‌ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం పర్యటన అనంతరం మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu