Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

Gulte.com 6 days ago

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారని అంతా అనుకున్నారు.

కానీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అనూహ్యంగా జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీకి అవకాశం ఇచ్చింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న ఈ నిర్ణయం షమీ భవిష్యత్తుపై మళ్ళీ అనుమానాన్ని మిగిల్చింది.

షమీ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతను చివరిసారిగా 2023లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత 2025లో ఇంగ్లాండ్‌పై టీ20 ఆడాడు. వన్డేల విషయానికి వస్తే గత ఏడాది న్యూజిలాండ్ పై ఆడాడు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన ఈ స్టార్ పేసర్, దేశవాళీ క్రికెట్ ఆడుతూ మళ్లీ ఫామ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే టెస్ట్ ఫార్మాట్ ఆడేంత ఫిట్‌నెస్ షమీకి ఇంకా రాలేదని అగార్కర్ స్పష్టం చేశాడు.

నిజానికి రంజీ ట్రోఫీలో షమీ మంచి ఫామ్ ను చూపించాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో 16.72 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 50 మేడిన్ ఓవర్లు ఉన్నాయి. ఒకే ఇన్నింగ్స్ లో 90 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన బెస్ట్ రికార్డ్ నమోదు చేశాడు. అయినా సరే సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఆకిబ్ నబీ అద్భుతమైన ఫామ్. అదే రంజీ సీజన్లో నబీ ఏకంగా 12.56 సగటుతో 60 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీలో చూపించిన టాలెంట్ కు నబీకి జాతీయ జట్టులో స్థానం లభించింది.

నబీ ఎంపిక ద్వారా అగార్కర్ కమిటీ సీనియర్లకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. కేవలం పేరు చూసి పాత రికార్డులు చూసి జట్టులోకి తీసుకోమని పరోక్షంగా చెప్పేశారు. షమీ మళ్లీ టెస్ట్ జట్టులోకి రావాలంటే దులీప్ ట్రోఫీ లాంటి రాబోయే టోర్నీలలో కుర్రాళ్లతో పోటీ పడి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే తన పూర్తి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. అన్‌క్యాప్డ్ యువ పేసర్లు దేశవాళీలో దుమ్మురేపుతూ నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు కాబట్టి, కేవలం సీనియర్ అనే ముద్రతో తిరిగి జట్టులోకి రావడం ఇక మీదట చాలా కష్టం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu