గత శుక్రవారం 'సింగ్‌గీతం' చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా సినిమా తీశారు. నాగ్ అశ్విన్ అండ్ టీం ఆయన కోసం ఎంతో శ్రమను, డబ్బును పెట్టింది.
కానీ ఆయన కమిట్మెంట్‌కు.. వీరి శ్రమకు, డబ్బుకు తగిన ఫలితం వస్తుందా అన్న సందేహాలు కలిగాయి. అందుక్కారణం.. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ డల్లుగా ఉండడమే. కానీ ఆ చిత్రం పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుని, మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పుష్ కూడా తోడై వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టింది.
కలెక్షన్లు క్రమ క్రమంగా పెరిగాయి. వీక్ డేస్‌లో కూడా కూడా సినిమా పర్వాలేదనిపిస్తోంది. మొత్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ అని చెప్పడంలో సందేహాలు లేవు. దర్శకుడిగా సింగీతానికి ట్రిబ్యూట్ ఇవ్వాలని ఈ చిత్రాన్ని ఇంకా థియేటర్లలో చూస్తున్న వాళ్లున్నారు. అలాగే ఇంకో వర్గం ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తోంది. ఐతే డిజిటల్ వెర్షన్‌లో మార్పులు జరుగుతాయని నిర్మాత నాగ్ అశ్విన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
'సింగ్‌గీతం' థియేట్రికల్ వెర్షన్‌తో డిజిటల్ వెర్షన్ భిన్నంగా ఉంటుందని నాగ్ అశ్విన్ తెలిపాడు. రిలీజ్ ముంగిట టైం సరిపోక కంప్యూటర్ గ్రాఫిక్స్ కొంచెం హడావుడిగా చేశామని, దీంతో ఔట్ పుట్ కూడా కొంచెం తేడా కొట్టిందని, ఆ విషయంలో విమర్శలూ వచ్చాయని నాగ్ అశ్విన్ అంగీకరించాడు. దీంతో పాటు మరి కొన్ని మార్పులు కూడా చేసి సినిమాను ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సినిమా డిజిటల్‌గా కొన్ని దశాబ్దాల పాటు ఆదరణ పొందుతూనే ఉంటుందని.. అందుకే మరింత మెరుగ్గా డిజిటల్ వెర్షన్‌ను రెడీ చేస్తున్నామని, కొన్ని బీటీఎస్ మూమెంట్స్ కూడా దీనికి జోడిస్తామని నాగి తెలిపాడు. కాబట్టి థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు కూడా ఇంకోసారి డిజిటల్‌గా ఈ సినిమా చూడడానికి ఒక కారణం దొరికినట్లే. 'సింగ్ గీతం' డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.11 కోట్లకు కొన్నట్లు వార్తలు వచ్చాయి. థియేట్రికల్ రిలీజ్ నుంచి నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం డిజిటల్‌గా రిలీజవుతుంది.

