Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

Gulte.com 13 hrs ago

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ఆ వీడియోలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేనినో అడ్డుకుంటున్నట్లు కనిపిస్తుంది.

వందేమాతర గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశ వ్యాప్తంగా దుమారం రేపిన ఈ వీడియో ఇరు పార్టీల మధ్య విమర్శలకు తావిచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించారు. సరిగ్గా ఆ సమయంలో సోనియా గాంధీ సిబ్బందికి ఏవో సంజ్ఞలు చేస్తున్నట్లు ఆ తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది.

వందేమాతర గేయం పూర్తిగా ఆలపిస్తుండగా సోనియా అడ్డుకున్నట్లు బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్స్ లో ఈ వీడియోను విడుదల చేసిన బీజేపీ వందేమాతరం పూర్తిగా ఆలపించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, ఆ పార్టీ నాయకులకు ఇంకా 1947 కు వున్న మనస్తత్వం మారలేదని కామెంట్ చేసింది. స్వాతంత్ర్య పోరాటం చేశామని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నిజస్వరూపం ఇదేనంటూ బీజేపీ అధికార ప్రతినిధి గోపాల కృష్ణ విమర్శలు గుప్పించారు. విశ్వ హిందూ పరిషత్ సైతం కాంగ్రెస్ పార్టీ బే షరతులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

అయితే ఇదంతా ఒట్టి ప్రచారమని కాంగ్రెస్ పార్టీ కొట్టి పారేసింది. వృద్ధాప్యంతో బాధ పడుతున్న పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎక్కువ సేపు నిలబడలేక పోవడంతో అక్కడ వున్న సిబ్బందిని కుర్చీ తీసుకొని రమ్మని సోనియా సూచించారని, ఆ వీడియో పట్టుకొని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఖర్గే నిలబడే వున్నారని వివరణ ఇచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ దేశభక్తి గురించి మాట్లాడ్డం గురివింద సామెత గుర్తుకు తెస్తుందని విమర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి.. కొద్ది రోజుల క్రితం వందేమాతరం పూర్తి గీతాన్ని పాడాలని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. అందులో ఇతర మతాల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని చరణాలు ఉన్నాయని, అవి అందరికీ తప్పనిసరి చెయ్యడం సబబు కాదని కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఒకరకంగా ఇది కూడా ఒక కారణం అయ్యుండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

వందేమాతరం గేయం ఆలపించడం బీజేపీకి కొత్తేమో కానీ కాంగ్రెస్ పార్టీ 1937 నుంచే ఆలపిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సమావేశంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ టాగోర్ సూచనతో అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో వందేమాతరం ఆలపించడం అనవాయితీగా వస్తుందని తెలిపింది. దేశ ప్రజల మధ్య విద్వేషాలు రాజేస్తున్న బీజేపీ అబద్దాలు ప్రచారం చేయడం అలవాటై పోయిందని ఆ తర్వాత ఇందిరా భవన్లో మాట్లాడుతూ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu