Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

Gulte.com 3 weeks ago

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.

నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి తారక్ అంటే ఎంత అభిమానమో తెలిసిందే. తారక్‌తో తన బాబాయి నిర్మించిన 'అరవింద సమేత' చిత్రాన్ని అన్నీ తానై చేసుకున్నాడు నాగవంశీ. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర, వార్-2 చిత్రాలను నాగవంశీనే డిస్ట్రిబ్యూట్ చేశాడు.

'వార్-2'కు తెలుగులో సరైన బిజినెస్ ఆఫర్లు లేని టైంలో నాగవంశీనే ముందుకొచ్చి ఫ్యాన్సీ రేటు ఇచ్చి సినిమాను తీసుకున్నాడంటే అది తారక్ మీద అభిమానంతోనే. తన ఫేవరెట్ హీరోతో 'గాడ్ ఆఫ్ వార్' సినిమాను నిర్మించాలనే ఆలోచన కూడా నాగవంశీకి ఉంది. ఐతే ఆ ప్రాజెక్టు ఉంటుందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తారక్ ఖాళీ చేసుకుని ఆ సినిమా చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది.

ఐతే ఈలోపు నాగవంశీకి రామ్ చరణ్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పుడో వార్త తెరపైకి వచ్చింది.
'పెద్ది' సినిమాను పూర్తి చేసి సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చరణ్ డేట్లను నాగవంశీ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

కొంత కాలంగా నాగవంశీకి బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం కలిసి రావడం లేదు. గత ఏడాది 'కింగ్డమ్', 'మాస్ జాతర'.. ఈ ఏడాది 'ఫంకీ' చిత్రాలతో షాక్‌ల మీద షాక్‌లు తిన్నాడు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన 'వార్-2' సైతం నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో తాను బౌన్స్ బ్యాక్ కావడానికి ఒక క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు నాగవంశీ. ఈ క్రమంలోనే అతను చరణ్ కాల్ షీట్స్ సంపాదించాడట. సుకుమార్ సినిమా తర్వాత నాగవంశీ బేనర్లోనే చరణ్ ఈ సినిమా చేయబోతున్నాడు.

అది కన్ఫమ్ అయితే సితార బేనర్లో ఇదే అతి పెద్ద సినిమా అవుతుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే పెద్ద సినిమాలను మాత్రమే హారిక హాసిన బేనర్లో చేస్తారన్న సంగతి తెలిసిందే. అవి కాకుండా మిడ్ రేంజ్ సినిమాలను సితారలో చేస్తుంటారు. ఈ బేనర్లో ఇప్పటిదాకా వచ్చిన అతి పెద్ద సినిమా అంటే.. 'భీమ్లా నాయక్'యే. ఇప్పుడు చరణ్ సినిమా కనుక ఓకే అయితే అదే భారీ చిత్రం అవుతుంది. ఈ సినిమాకు దర్శకుడు, కథ కోసం నాగవంశీ వేటలో ఉన్నాడు. ఈ మూవీ మొదలవడానికి చాలా టైం ఉంది కాబట్టి.. సెట్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu