Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తండ్రి అంత్యక్రియలకు రాలేని పరిస్థితిలో దేశ అధ్యక్షుడు

తండ్రి అంత్యక్రియలకు రాలేని పరిస్థితిలో దేశ అధ్యక్షుడు

Gulte.com 18 hrs ago

మొజ్తబా ఖమేనీ. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్‌. కానీ.. పేరుకే ఇది పరిమితం అయింది. ఆయన బయటకు వచ్చేందుకు.. ప్రజలకు మొహం చూపించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

ఎంతగా అంటే.. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా కన్న కొడుకుగా హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం.. వెంటాడుతున్న మృత్యువు. ఏక్షణాన ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో తెలియని మృత్యువు ను ఎదుర్కొనలేని పరిస్థితి ఇప్పుడు ఇరాన్‌లో నెలకొంది.

ఏం జరిగింది?

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన క్షిపణుల వర్షంలో ఇరాన్ అప్పటి సుప్రీం పాలకుడు అయతొల్లా అలీ ఖమేనీ సహా.. ఆయన కుటుంబం మొత్తం(ఒక్క కుమారుడు తప్ప) ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు మొజ్తబా(57) మాత్రమే తీవ్ర గాయాలతో బయట పడ్డారని ఇరాన్ ప్రకటించింది. ఇక, అప్పటి నుంచి కూడా మొజ్తబాకు వైద్యం అందిస్తున్నారని సమాచారం వచ్చిందే తప్ప.. అధికారికంగా ఆయన ఎక్కడా బయటకు రాలేదు.

ఈ విషయంలో అమెరికా.. మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని ప్రకటన చేయగా, ఇజ్రాయెల్ మాత్రం ఆయన జీవించి లేడని, ఒకవేళ ఉంటే ఏ క్షణమైనా మట్టుబెడతామని ప్రకటించింది. ప్రస్తుతం నాలుగు మాసాలుగా సాగిన ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టినా.. ఇరాన్‌-ఇజ్రాయెల్ మధ్య మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మొజ్తబా ఖమేనీ విషయం ఇంకా సస్పెన్సులోనే ఉంది. ఆయన ఎక్కడున్నారన్నది తెలియ రాలేదు.

మరోవైపు ఫిబ్రవరి 28న మృతి చెందిన ఖమేనీ మృతదేహానికి ఈ నెల 5న అంత్యక్రియలు జరగనున్నాయి. కుమారుడిగా కడ చూపు, అంత్యక్రియలు నిర్వహించే బాధ్య మొజ్తబాపై ఉంది. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని ఇరాన్ ప్రకటించింది. దీనికి కారణం కూడా వివరించింది. మొజ్తబాకు ప్రాణ హాని ఉంది. ఏ క్షణమైనా శత్రువులు ఆయనను అంతం చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంత శక్తిమంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి.. మొజ్తబాను కాపాడే పరిస్థితి లేదు. అందుకే ఆయన ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కారు అని ప్రకటించింది.

మరోవైపు మొజ్తబా కోసం మాటు వేశామని ఇజ్రాయెల్ బహిరంగ ప్రకటన చేసింది. ఆయన ఎక్కడున్నా అంతం చేస్తామని హెచ్చరించింది. దీంతో ఇరాన్‌లో ఉద్రిక్తతలు పీక్ స్థాయికి చేరాయి. ఇంకోవైపు.. ఖమేనీ అంత్యక్రియలపైనా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ చెప్పినట్టు ఇరాన్ వెల్లడించడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu