Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ పాలిటిక్స్‌: పవన్ భయమా. ఓట్ల భయమా?

తెలంగాణ పాలిటిక్స్‌: పవన్ భయమా. ఓట్ల భయమా?

Gulte.com 3 weeks ago

తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.

ఇదేసమయంలో తెలంగాణ వాదాన్ని మరోసారి తీసుకువచ్చారు. జూన్ 2న గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభపేరుతో సమ్మేళనాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయం వెలుగు చూడగానే.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత.. ఖస్సున లేచారు. పవన్‌పైనా.. ఆయన వ్యవహారంపైనా.. గతంలో తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలను తవ్వితీసి విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో ఎలా సభ పెట్టుకుంటారని.. ఏపీలో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యవహారం వెనుక పవన్ అంటే భయమా? లేక.. ఓటు బ్యాంకు అంటే భయమా? అనేది ఆసక్తిగామారింది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌లుకూడా కీలకంగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఇప్పుడు బలోపేతం అయితే.. కీలకమైన సెటిలర్ల ఓటు బ్యాంకు.. జనసేనకు మళ్లే అవకాశం ఉంటుందన్న అంచనాలు వస్తున్నాయి. అదేసమయంలో మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా.. జనసేనకు అండగా మారే అవకాశం ఉంది.

ఇక, పెట్టుబడి దారులు, రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా.. ఏపీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే కావడంతో వారి మద్దతు కూడా జనసేనకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది. సెటిలర్ల ఓట్లు ముఖ్యంగా యువత ఓట్లు జనసేనకు పడే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిని నిలువరించేందుకే.. అసలు పవనే రాకుండా చేసే వ్యూహం పన్నుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్లు మళ్లుతున్న నేపథ్యంలో పవన్ ఎంట్రీ ఇస్తే.. అది కాంగ్రెస్‌కు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అందకే.. ఆయా పార్టీలు పవన్‌ను టార్గెట్ చేస్తున్నాయన్న చర్చ నడుస్తోంది.

బీజేపీ మౌనం ఎందుకు?

మరోవైపు.. జనసేనతో ఏపీలోను.. కేంద్రంలోనూ కూటమిగా ఉన్న బీజేపీ.. తెలంగాణ విషయానికి వస్తే.. మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఇంత జరుగుతున్నా.. పవన్‌ను ఇంతగా విమర్శిస్తున్నా.. తెలంగాణ బీజేపీ నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేక పోయారు. తెలంగాణ వ్యతిరేకిగా పవన్‌పై ముద్ర వేస్తున్నా.. బీజేపీ నాయకులు ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదు. దీంతో బీజేపీ వైఖరి ఏంటనేది ఆసక్తిగామారింది. నిజానికి కేంద్రంలో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu