Dailyhunt
ఉత్తర పార్టీ నేతల ప్రశంసలకు బాబు విస్మయం

ఉత్తర పార్టీ నేతల ప్రశంసలకు బాబు విస్మయం

Gulte.com 2 weeks ago

పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 పార్టీలకు చెందిన ఎంపీలు ప్రసంగించారు.

ఇరు సభల్లోనూ సుమారు 4 గంటల పాటు ఈ వ్యవహారంపై చర్చ సాగింది. ఆయా చర్చల్లో ఢిల్లీ, యూపీ, పంబాజ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, బీహార్ సహా.. పలు రాష్ట్రాలకుచెందిన ప్రాంతీయ పార్టీల ఎంపీలు మాట్లాడారు.

ఆ సమయంలో పలువురు సీఎం చంద్రబాబు దూరదృష్టిని కొనియాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సమాజ్ వాదీ పార్టీ వరకు.. జేడీయూ నుంచి జేఎంఎం వరకు.. పలువురు పార్టీల ఎంపీలు.. చంద్రబాబు దూరదృష్టిని కొనియాడారు. “చంద్రబాబు విజన్‌ను నేను దగ్గరగా చూశాను“ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. “చంద్రబాబు చాలా సీనియర్‌. ఆయన ఏం చేసినా.. 30 ఏళ్ల ముందు ఆలోచించే చేస్తారు“ అని యూపీకి చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు.

ఇలానే పలువురు నాయకులు.. చంద్రబాబు విజన్‌ను ప్రస్తావించారు. కొనియాడారు కూడా. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్‌లో ప్రస్తావించిన సీఎం .. “వారు.. నా గురించి అలా చెప్తారనుకోలేదు. అసలు వారితో నాకు పెద్దగా పరిచయమేలేదు. అఖిలేష్‌(సమాజ్‌వాదీ పార్టీ సుప్రీం)తో నాకు పెద్దగా పరిచయం లేదు. ఆప్ నేత అరవింద్‌తో పరిచయం ఉన్నా.. చాలా ఎళ్లయింది.. కానీ.. ఇప్పుడు వారు నాగురించి ఇంత గొప్పగా మాట్లాడడం చూస్తే.. ఆశ్చర్యం వేస్తోంది. మనం ఏం చేసినా.. ఒక రాష్ట్రం మాత్రమే కాదు.. దేశం మొత్తం చూస్తోందన్న విషయాన్ని గ్రహించాను. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలుగు జాతి ప్రయోజనాల కోసం సంపద సృష్టికి ఓ ప్రాంతం తయారు కావాలనే హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేశామన్నారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని ఆ రోజు చెప్పామన్న చంద్రబాబు.. చాలా అంశాలు పరిష్కారం కాకున్నా విభజన జరిగిందన్నారు.

“ఆర్ధిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు అన్నీ ఇబ్బందులే. అక్కడి నుంచే మొదలయ్యాం. అప్పాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరాను. తెలంగాణకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. తెలంగాణాకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకోను“ అని వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu