Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైట్ల సినిమాకు ఇంత డిమాండా?

వైట్ల సినిమాకు ఇంత డిమాండా?

Gulte.com 4 hrs ago

ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. అప్పటి టాప్ స్టార్లంతా ఆయనతో సినిమాలు చేయాలని తహతహలాడారు.

కానీ 'దూకుడు'తో కెరీర్ పీక్‌ను అందుకున్న ఆయన.. ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయారు. ఎన్టీఆర్‌తో చేసిన 'బాద్‌షా' ఓ మాదిరిగా ఆడితే.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు ఎదురయ్యాయి. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ ఎంత దారుణమైన ఫలితాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 'విశ్వం' అనే సినిమా తీస్తే అది కూడా ఆడలేదు. ఆ సినిమా చూశాక వైట్ల బౌన్స్ బ్యాక్ అవడం అసాధ్యమన్న భావన కలిగింది. ఆయన ఇంకో సినిమా దక్కించుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ శర్వానంద్ లాంటి ఫామ్‌లో ఉన్న హీరోతో సినిమా ఓకే చేసుకోవడమే కాదు.. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడే పరిస్థితి తీసుకురాగలగడం ఆశ్చర్యం కలిగించే విషయం.

శ్రీను వైట్ల, శర్వానంద్ కలయికలో మొదలైన 'జార్జ్ క్రిష్' సినిమాను సీనియర్ నిర్మాత అనిల్ సుంకర ఏరికోరి దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమా వేరే బేనర్లో తెరకెక్కాల్సింది. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఐతే గతంలో ఒక ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. శ్రీను వైట్ల ఈ సినిమా కథను తనతో పంచుకున్నాడని, తాను ఈ సినిమాను నిర్మిస్తే బాగుంటుందని ఆశించానని చెప్పారు. ఐతే అనూహ్యంగా చివరికి ఈ చిత్రం ఆయన చేతుల్లోకే వచ్చింది.

ఈ సినిమాకు మొన్ననే ప్రారంభోత్సవం జరపగా.. అదే రోజు వచ్చే జనవరి 14కు రిలీజ్ డేట్ ఇవ్వడమే కాదు, ఈ సినిమాను ఏ ఏరియాలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నది కూడా ప్రకటించేశారు అనిల్ సుంకర. నైజాంలో ఏషియన్ సురేష్ లాంటి టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. మిగతా మేజర్ ఏరియాలకు కూడా డిస్ట్రిబ్యూర్లు కన్ఫమ్ అయ్యారు. వేరే బేనర్లో తెరకెక్కాల్సిన సినిమాను కోరి దక్కించుకోవడం.. మొదలైన రోజే రిలీజ్ డేట్, డిస్ట్రిబ్యూటర్లను ఫిక్స్ చేయడం లాంటి పరిణామాలు చూస్తే ఈ సినిమాకున్న క్రేజ్ అర్థమవుతోంది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న వైట్ల కొత్త చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడడం ఆశ్చర్యకరమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu