Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ గెలిచింది 'ఇన్ స్టాగ్రామ్' తోనా.?

విజయ్ గెలిచింది 'ఇన్ స్టాగ్రామ్' తోనా.?

Gulte.com 5 days ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో నుంచి వచ్చిన స్టార్ హీరో విజయ్ నేరుగా సీఎం కుర్చీ ఎక్కేశారు.

అప్పటిదాకా విజయంపై ధీమాతో సాగిన తాజా మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పదవిని వదులుకోక తప్పలేదు. అయితే తాజాగా విజయ్ సాధించిన విజయంపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన పార్టీని ప్రమోట్ చేసుకుని… కేవలం యువతను ఆకట్టుకుని విజయం దక్కించుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో తన మాటలు సత్యదూరం ఏమీ కాదని చెప్పిన స్టాలిన్ కొన్ని వార్తా సంస్థలు విడుదల చేసిన వివరాలను ప్రస్తావించారు. వాటి ఆధారంగా ప్రచురితమైన కథనాలు ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. స్టాలిన్ చెప్పినట్టుగానే విజయ్ తన ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా హోరెత్తించారు.

ఈ క్రమంలో విజయ్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఫేస్ బుక్, ట్విట్టర్ లతో పాటు ఇన్ స్టాగ్రామ్ ను కూడా విరివిగానే వాడుకుని ఉంటుంది. ఇందులో ఎలాంటి తప్పు లేదని చెప్పవచ్చు. అయితే కేవలం ఇన్ స్టాగ్రామ్ నే నమ్ముకున్న విజయ్… ఎన్నికల్లో తన పార్టీ తరఫున అవసరమైన మేర ఏజెంట్లను కూడా వినియోగించకుండానే విజయం సాధించారని స్టాలిన్ చేసిన ఆరోపణ ఆసక్తి రేకెత్తిస్తోంది.

స్టాలిన్ చెబుతున్న దాని ప్రకారం… ఇన్ స్టాగ్రామ్ రీచ్ అధికంగా కలిగిన ప్రాంతాల్లోనూ విజయ్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. చెన్నై జిల్లా పరిధిలో ఇన్ స్టాగ్రామ్ రీచ్ 58 శాతం ఉండగా… అక్కడ టీవీకే ఏకంగా 14 స్థానాలను దక్కించుకుంది. ఇక కోయంబత్తూరులో 49 శాతం ఇన్ స్టాగ్రామ్ రీచ్ ఉండగా… అక్కడ విజయ్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించింది. మదురైలో 43 శాతం ఇన్ స్టాగ్రామ్ రీచ్ ఉండగా… అక్కడ టీవీకే ఏకంగా 8 స్థానాలను దక్కించుకుంది. ఇలా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసిన విజయ్ పార్టీ… మెజారిటీ సీట్లను సాధించిందని చెప్పవచ్చు.

సాధారణంగా ఓడిపోయిన పార్టీ ఏవీఎంలతో మేనేజ్ చేసుకుని విజయం సాధించిందంటూ గెలిచిన పార్టీలపై నిందలు వేస్తుంటాయి. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధిస్తే… ఏవీఎంలను మేనేజ్ చేసుకునే ఆ పార్టీలు విజయం సాధించాయని విపక్ష వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తరహా ఆధారం లేని వాదనలను వినిపించని స్టాలిన్… విజయ్ పార్టీ విజయం వెనుక ఉన్న అసలు నిజాన్ని గ్రహించగలిగారంటూ సరికొత్త విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అయితే కేవలం సోషల్ మీడియా వలనే విజయ్ గెలిచారా అంటే అవునని చెప్పలేం. సోషల్ మీడియా మాధ్యమాల ప్రభావం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి చేసేంత ఉందంటే అతిశయోక్తి అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత గురించి స్టాలిన్ మర్చిపోవడం హాస్యాస్పదమని టీవీకే నాయకులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu