Dailyhunt
విజయ్ విజయమే.. మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే?

విజయ్ విజయమే.. మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే?

Gulte.com 1 week ago

మిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్‌లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే గెలుపు ముంగిట ఉన్న విజయ్ ఇచ్చిన భారీ హామీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

దేశంలో ఎందరో నాయకులు ఎన్నికల ముందు అద్భుతమైన వాగ్దానాలు చేసి, గెలిచాక వాటిని విస్మరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలు కేవలం ఓట్ల కోసమేనా లేక నిజంగానే అమలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

విజయ్ మేనిఫెస్టోలో మహిళలే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నారు. కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2,500 నగదు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనితో పాటు వధువులకు సార్వభౌమ బంగారు నాణెం, పట్టు చీర.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం లాంటి ఖరీదైన వాగ్దానాలు చేశారు. ఆడపిల్లల చదువు కోసం ఏటా రూ.15,000 ఇస్తామని చెప్పడం క్షేత్రస్థాయిలో ఓటర్లను బాగా ఆకట్టుకుంది. ఈ పథకాలకు భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి కాబట్టి, వీటి అమలు విజయ్ సర్కార్‌కు పెద్ద సవాలు కానుంది.

యువతకు ఉపాధి కల్పించడంలోనూ విజయ్ వినూత్న హామీలు ఇచ్చారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా చేసిన వారికి రూ.2,500 చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. ఐదు లక్షల మంది యువతను “సీఎం పీపుల్ సర్వీస్ అసోసియేట్” ప్రోగ్రామ్ కింద నెలకు రూ.18,000 జీతంతో నియమిస్తామన్న హామీ నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేపింది. కంపెనీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా ప్రోత్సాహకాలు ఇస్తామనడం ద్వారా ఆయన స్థానిక సెంటిమెంట్‌ను బలంగా వాడుకున్నారు.

రైతు సంక్షేమం కోసం ఐదు ఎకరాల లోపు ఉన్న వారి సహకార రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. వరి క్వింటాల్‌కు 3,500, చెరకుకు 4,500 మద్దతు ధర ఇస్తామని పక్కాగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చే మద్దతు ధర కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. వ్యవసాయ కూలీల కోసం సాగు హక్కు కార్డుల ద్వారా 10,000 సాయం చేస్తామన్న పాయింట్ కూడా గ్రామీణ ఓటర్లపై బాగా పని చేసింది.

విజయ్ తన మేనిఫెస్టోను కేవలం కాగితాల మీద వాగ్దానాలు కాదని, “నిజాయితీ గల పాలనకు హామీ” అని ప్రకటించారు. తిరుక్కురళ్ సిద్ధాంతాలైన ధర్మం, సంపద, ఆనందం ప్రాతిపదికన వీటిని రూపొందించినట్లు ఆయన చెబుతున్నారు. ఇతర పార్టీల మాదిరిగా ప్రజలను తప్పుదోవ పట్టించబోనని విజయ్ గట్టిగా వాదిస్తున్నారు. ఏది ఏమైనా, గెలిచిన తర్వాత ఈ భారీ పథకాలకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తెస్తారు.. ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటారు అన్నదే ఇప్పుడు తమిళనాట అతిపెద్ద ప్రశ్న.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu