Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

Gulte.com 1 week ago

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు మారినా… తాజా మాజీలతో కొత్త సీఎంలు భేటీ అయ్యారు.

రాజకీయాలు ఎన్నికల వరకే… ఆ తర్వాత అంతా కలిసి పనిచేద్దామంటూ వారు ఆసక్తికర చర్చలు చేశారు.

అయితే ఈ తరహా దృశ్యాలు మన తెలుగు రాష్ట్రాల్లో అసాధ్యమన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. ఓ పార్టీని మరో పార్టీ దాదాపుగా వ్యక్తిగత శత్రువుగా పరిగణిస్తున్న తెలుగు నేల రాజకీయాల్లో ఆయా పార్టీల నేతలూ అదే తీరున వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కేరళంలో అదికార ఎల్డీఎఫ్ ను చిత్తు చేసిన యూడీఎఫ్ పినరయి విజయన్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. యూడీఎఫ్ తరఫున కేరళం కొత్త సీఎంగా వీడీ సతీషన్ ఎంపికయ్యారు. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తిరువనంతపురంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది.

తన ఇంటి నుంచి బయలుదేరిన సతీషన్.. నేరుగా విజయన్ ఇంటికి చేరారు. సతీషన్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విజయన్ ఎదురేగి మరీ స్వాగతం పలికారు. ఇరువురి అభివాదం తర్వాత సతీషన్ ను తన ఇంటిలోకిని విజయన్ ఆహ్వానించారు.

ఇక మొన్నటికి మొన్న తమిళనాట నూతన సీఎంగా పదవీ ప్రమాణం చేసిన స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్… సీఎంగా ప్రమాణం చేశాక… నేరుగా తాజా మాజీ సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగానూ విజయ్ కి స్టాలిన్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మీ అనుభవం మాకు అవసరమని విజయ్ అంటే… అవసరమైనప్పుడు తప్పక సాయం చేస్తామని స్టాలిన్ చెప్పుకొచ్చారు. వెరసి నేటి విజయన్, సతీషన్ దృశ్యాల మాదిరే.. నాడు విజయ్, స్టాలిన్ ల దృశ్యాలూ ఆకట్టుకున్నాయి.

ఈ తరహా పరిస్థితులు, దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయా?… అంటే సమీప భవిష్యత్తులో దుస్సాధ్యమేనన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ తరహా రాజకీయాలకు ఒకింత ఆసక్తిగానే ఉన్నా.. అవతలి పార్టీ బీఆర్ఎస్ నుంచి మాత్రం ఆ తరహా స్పందన కనిపించడం లేదనే చెప్పాలి.

కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే… రేవంత్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. అదే ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినా.. బీఆర్ఎస్ నుంచి ఈ తరహా పలకరింపులు కనిపించడం లేదు. వెరసి రేవంత్ ను గులాబీ నేతలు ఏదో తమకు వ్యక్తిగత శత్రువుగా చూస్తున్నారన్న విమర్శలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే… అక్కడ కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని చెప్పక తప్పదు. ప్రత్యర్థి పార్టీలతో ఒకింత కలిసిమెలసి సాగేందుకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపినా.. విపక్ష వైసీపీ నుంచి ఆ దిశగా అసలు స్పందనే కనిపించని పరిస్థితి.

వైసీపీ అధినేత జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా…. ఆయన చంద్రబాబుతో పాటు ఇతర విపక్ష నేతలతో ఉల్లాసంగా గడిపేవారు. వైఎస్ మాదిరే చంద్రబాబు కూడా వ్యవహరించేందుకు ఆసక్తి కనబరచినా… జగన్ నుంచి స్పందన కరువవుతోంది. జగన్ కుమార్తె లండన్ లో సీటు సాధిస్తే.. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడంతో పాటుగా జగన్ కుమార్తెను అభినందించారు. అయితే జగన్ లో ఆ తరహా మార్పు కానరావడం లేదనే చెప్పాలి. వెరసి తెలుగు నేలలో వైరి వర్గాలు కలిసే ఛాన్సే లేదని చెప్పక తప్పదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu