ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం జరిగినా.. ప్రధాని మోడీకి రాజకీయాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం నెలకొన్న యుద్ధ సమయాన్ని.. తద్వారా వచ్చిన ఇంధన విపత్తును ఎవరూ కాదనలేరన్నారు. కానీ.. దీని వెనుక చేసిన రాజకీయమే ఇప్పుడుచర్చకు కీలకమని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే.. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైందన్నారు.
ఆ సమయంలోనే చమురు ఉత్పత్తులు.. రావడం తగ్గిపోయిందని, కానీ, ఆ సమయంలో ఈ విషయాన్ని దాచి పెట్టిన ప్రధాని, ఐదురాష్ట్రాల ఎన్నికలు ముగియగానే.. ధరలు పెంచి.. పొదుపు మంత్రం పాటించాలని చెప్పడం రాజకీయం కాక మరేమిటని ప్రశ్నించారు. యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో చెప్పలేమని.. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు కూడా ఎప్పటి వరకు ఉంటుందో కూడా చెప్పలేమని తెలిపారు. కానీ, మోడీది రాజకీయ కోణమైతే.. తమది కార్మికుల కోణమని స్పష్టం చేశారు.
కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ.. విషయాన్ని దాచిపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనుకునే మోడీ వంటి వ్యక్తులకు వ్యతిరేకంగా సమాజం ఒకే తాటిపైకి రావాలని సూచించారు. మేధావులు ఈ విషయాన్ని చర్చించాలన్నారు.

