Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

HashtagU Telugu 1 week ago

హైదరాబాద్‌ బండ్లగూడ మండలం పరిధిలోని బండ్లగూడ గ్రామం సర్వే నెంబర్‌ 62లో ఉన్న సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ వివాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

సదరు విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించినప్పటికీ ఫాతిమా ఒవైసీ కాలేజీపై బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విజయ్‌ గోపాల్‌ అనే న్యాయవాది గతంలో ప్రజాప్రయోజన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా సదరు వివాదాస్పద విద్యా సంస్థకు అసలు ఎలా అనుమతులు మంజూరు చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పాఠశాల విద్యాశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది వెంకట్‌రాజు గౌడ్‌ సమాధానం ఇస్తూ.. ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదని కోర్టుకు వెల్లడించారు. ఈ సమాధానంపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కనీస అనుమతులు లేనప్పుడు ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల హాల్‌ టికెట్లు, విద్యా సర్టిఫికెట్లు ఎలా అందుతున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఇతర గుర్తింపు పొందిన కాలేజీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కేవలం ఈ ఫాతిమా కాలేజీలో అకామిడేషన్ మాత్రమే తీసుకుంటున్నారని, వారి హాల్‌టికెట్‌లు, సర్టిఫికెట్లు అన్నీ అనుమతి ఉన్న ఇతర సంస్థల నుంచే జారీ అవుతున్నాయని కోర్టుకు వివరించారు.

ప్రభుత్వ యంత్రాంగం సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సదరు విద్యాసంస్థ భవన నిర్మాణానికి కనీసం జీహెచ్‌ఎంసీ నుంచి అయినా అనుమతి ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. భవన నిర్మాణ అనుమతులు, సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ వంటి అత్యంత కీలకమైన అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే మూడు నెలల సుదీర్ఘ సమయం ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ.. చివరి అవకాశంగా వారం రోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ, విద్యాశాఖ సహా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కౌంటర్లు దాఖలు చేయని పక్షంలో ఈనెల 9 నాటికి కోర్టు వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని, రికార్డులను ఆధారంగా చేసుకుని తుది ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu