''ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్''.. అని రవిశాస్త్రి అరుస్తూ చెప్పిన కామెంటరీ ఇప్పటికీ ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది.
2011 ఏప్రిల్ 2.. కోట్లాది భారతీయుల కల నిజమైన రోజు. ఇండియా రెండో సారి వన్డే ప్రపంచకప్ దక్కించుకున్న రోజు. ఆ అద్భుతానికి ఈ రోజుతో సరిగ్గా 15 ఏళ్లు నిండాయి.
ధోని విలన్?
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. భారత్ రెండోసారి 50 ఓవర్ల ప్రపంచ కప్ గెలిచి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోని కొట్టిన ఆ అద్భుతమైన సిక్సర్ ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
ఆ షాట్ కొట్టిన క్షణం దేశమంతా పండగ చేసుకుంది, కానీ ఆ విజయం తర్వాత భారత క్రికెట్‌లో ఊహించని మార్పులు మొదలయ్యాయి. ధోని విలన్ గా మారాడనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకు కొన్ని కారణాలున్నాయి.
సీనియర్ల నిష్క్రమణ
ఆ ప్రపంచ కప్ విజయం కేవలం మధుర స్మృతులతోనే మిగిలిపోలేదు, అది కొందరు దిగ్గజ ఆటగాళ్ల కెరీర్‌లకు ముగింపు పలికింది. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ వంటి కీలక ఆటగాళ్లను ఆ తర్వాత ఒక్కొక్కరిగా పక్కన పెట్టడం మొదలైంది. వయసు రీత్యా సచిన్ తప్పుకున్నా, మిగతా ఆటగాళ్లకు అది తమ చివరి ప్రపంచ కప్ అని అప్పుడు తెలియదు.
గంభీర్ పోరాటం
2011 వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సెహ్వాగ్, సచిన్ త్వరగా ఔట్ అయినప్పుడు గౌతమ్ గంభీర్ చేసిన 97 పరుగులు అత్యంత విలువైనవి. విరాట్ కోహ్లీతో కలిసి అతను నెలకొల్పిన 83 పరుగుల భాగస్వామ్యం భారత్‌ను ఓటమి అంచు నుండి గెలుపు వైపు నడిపించింది. కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ధోనీకి దక్కడంపై గంభీర్ ఇప్పటికీ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తూ ఉంటాడు.
ధోని నిర్ణయాలు
2013 ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి జట్టులో ధోని, కోహ్లీ, రైనా తప్పా 2011 ప్రపంచకప్ ఆడిన వాళ్లలో పాతవారెవరూ లేకపోవడం గమనార్హం. తమలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని భావిస్తున్న సమయంలోనే జట్టు నుండి తప్పించారని హర్భజన్, సెహ్వాగ్ అనేకసార్లు వాపోయారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ మద్దతు ధోనీకి ఉండటం వల్లే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోగలిగారనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు శ్రీనివాసన్ ఓనర్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వీళ్ల మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకున్నాడని ధోనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకు అతణ్ని విలన్ గా కొంతమంది భావిస్తున్నారని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.
గంభీర్, ధోని మధ్య
అయితే కాలక్రమేణా ఆటగాళ్ల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు గంభీర్, ధోని సోషల్ మీడియాలో ఆత్మీయంగా సంభాషించుకోవడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం భారత హెడ్ కోచ్‌గా ఉన్న గంభీర్.. ధోని పట్ల తనకున్న విభేదాలను పక్కన పెట్టి భారత క్రికెట్ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నాడు.
Chandu Shanigarapu

