సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ తిరుపతిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆస్తి హక్కు కార్యాలయాన్ని ప్రారంభించింది. 22ఏ జాబితా సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా నిలిచి, వారితో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
'కఠినమైన 22A జాబితాలో తమ భూములు చేర్చటం వల్ల చట్టబద్ధంగా పొందిన ఆస్తులను వినియోగించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి తరఫున ఈ సంస్థ పోరాడుతుంది,' అని సంస్థ చైర్మన్, మాజీ పోలీస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావు ప్రకటించారు. తిరుపతిలోని అన్నమయ్య రోడ్డులో ఈ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ భూములను 22A జాబితా నుండి విడిపించుకోవడానికి భూ యజమానులు ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందేనా అని ప్రశ్నించారు. 2010లోనే ఈ భూములను ఆ జాబితాలో చేర్చారని, ఇప్పటికీ అసలైన యజమానులు వాటిని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
రైతులు, పేదల భూములను ప్రభుత్వాలు 22ఏ పేరిట నిషేధిత జాబితాలో ఉంచాయని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఎప్పటినుంచో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించారని పేర్కొన్నారు. 1971 నుంచి పాసుపుస్తకాలు, అడంగళ్లు, 1బీలు వచ్చాయన్నారు. 'వాటిని బ్యాంకుల్లో పెట్టి రైతులు అప్పులు తెచ్చుకున్నారు, కట్నాలుగా ఇచ్చారు. పిల్లలకు రాసిచ్చారు. ఇలాంటివి ప్రభుత్వ భూములుగా చూపించి.. 22ఏ నిషేధిత జాబితాలో ఉంచడం సరైనది కాదు. నోటీసులు ఇవ్వకుండా, ఎవరికీ తెలియకుండా.. నిషేధిక జాబితాలో ఉంచిన వాటిని తిరిగి వారికి చెందేలా చూడాలి.' అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
ఇదే సమయంలో కేంద్ర కన్వీనర్ నల్లమోతు చక్రవర్తి దీనిని ప్రభుత్వం సృష్టించిన ఒక తీవ్రమైన సంక్షోభంగా అభివర్ణించారు. దీనివల్ల ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూములను విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారుల తీరును కూడా ఆయన తప్పుబట్టారు.
Anand Sai, Tirupati

