Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదాయానికి మించిన ఆస్తులు - TTD డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

ఆదాయానికి మించిన ఆస్తులు - TTD డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, బుధవారం ఉదయాన్నే మెరుపు దాడులు చేపట్టారు.

ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని ముఖ్యమైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, ఆస్తుల పత్రాలు, నగదు, బంగారానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

  • ఈ దాడులు కేవలం లోకనాథం ఇంటికే పరిమితం కాలేదు. తిరుపతి, తిరుమలతో పాటు మొత్తం 5 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
  • తిరుమలలో ఉన్న డిప్యూటీ ఈవో లోకనాథం అధికారిక కార్యాలయంలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించి, రికార్డులను పరిశీలిస్తున్నాయి.
  • తిరుపతిలో నివసిస్తున్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.
  • ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలోనూ ఏసీబీ బృందాలు విస్తృతంగా శోధిస్తున్నాయి.

సుదీర్ఘ కాలంగా టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్న లోకనాథంపై పెద్ద ఎత్తున అక్రమాస్తుల ఫిర్యాదులు రావడంతోనే ఈ దాడులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఎంత మొత్తం ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

చాలా ఏళ్ల తర్వాత ఇలా..!

2011లో టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత టీటీడీ ఉద్యోగి నివాసంలో తనిఖీలు చేయడం ఇదే తొలిసారి అని సమాచారం…!

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu