Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఓ తగిలిన వారికి జాక్​పాట్! 111శాతం ప్రీమియంతో Tempsens Instruments లిస్టింగ్..

ఐపీఓ తగిలిన వారికి జాక్​పాట్! 111శాతం ప్రీమియంతో Tempsens Instruments లిస్టింగ్..

భారత ఐపీఓ మార్కెట్​లో మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తోంది. శుక్రవారం (ఆగస్టు 28) దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టిన 'టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఇండియా) లిమిటెడ్' షేర్లు రికార్డు స్థాయి లిస్టింగ్ గెయిన్స్‌తో ఇన్వెస్టర్ల ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి!

ఇష్యూ ధర రూ. 300తో పోల్చితే.. టెంప్​సెన్స్ ఇన్​స్ట్రుమెంట్స్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్​ (బీఎస్​ఈ)లో ఏకంగా 110.40 శాతం ప్రీమియంతో రూ. 631.20 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్​ (ఎన్​ఎస్​ఈ)లో 111.3 శాతం ప్రాఫిట్‌తో రూ. 634.00 వద్ద షేర్లు అరంగేట్రం చేశాయి.

ఈ ఐపీఓ అల్లాట్‌మెంట్ పొందిన దరఖాస్తుదారుల పెట్టుబడి తొలిరోజే రెట్టింపు కంటే ఎక్కువ కావడంతో మార్కెట్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.

టెంప్​సెన్స్ ఇన్​స్ట్రుమెంట్స్ ఐపీఓ లిస్టింగ్- వివరాలు..

టెంప్​సెన్స్ ఇన్​స్ట్రుమెంట్స్ ఐపీఓ లిస్టింగ్ సమయానికి అద్భుతమైన గెయిన్స్ కనిపించినప్పటికీ, ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపారు. దీనితో ఉదయం 11 గంటలకు బీఎస్‌ఈలో సంస్థ షేర్లు రూ. 593.60 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ. 596.10 వద్ద కొనసాగుతున్నాయి.

శుక్రవారం ఉదయం గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 330గా నమోదు కావడంతో, రూ. 630 వద్ద లిస్ట్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయి.

టెంప్​సెన్స్ ఇన్​స్ట్రుమెంట్స్ కంపెనీ వివరాలు..

థర్మల్ ఇంజినీరింగ్, ప్రత్యేక కేబుళ్ల తయారీ రంగంలో టెంప్‌సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రత్యేక ముద్ర వేసింది. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్, ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజెస్, స్పెషలైజ్డ్ కేబుళ్లను ఇది డిజైన్ చేసి తయారు చేస్తుంది. ఉక్కు, విద్యుత్, ఫార్మా, పెట్రోకెమికల్, డిఫెన్స్, న్యూక్లియర్ రంగాలకు చెందిన ప్రధాన పరిశ్రమలకు ఈ సంస్థ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

కంపెనీ ఆర్థిక మూలాలు ఎంతో దృఢంగా ఉన్నాయి.

2023-24 (ఎఫ్​వై24) ఆర్థిక సంవత్సరంలో రూ. 274.81 కోట్లుగా ఉన్న ఆపరేషనల్ రెవెన్యూ, 2024-25 (ఎఫ్​వై25) నాటికి రూ. 378.53 కోట్లకు పెరిగింది. 2025-26 (ఎఫ్​వై26) లో ఇది ఏకంగా రూ. 444.88 కోట్లకు చేరుకుని విపరీతమైన వృద్ధిని కనబరిచింది.

కంపెనీ నికర లాభాలు (ప్యాట్) కూడా అదే స్థాయిలో పుంజుకున్నాయి. ఎఫ్​వై24లో రూ. 41 కోట్లుగా ఉన్న నికర లాభం, ఎఫ్​వై25 నాటికి రూ. 60.57 కోట్లకు, ఎఫ్​వై26 ముగిసే సమయానికి రూ. 67.35 కోట్లకు ఎగబాకింది.

టెంప్​సెన్స్ ఇన్​స్ట్రుమెంట్స్ ఐపీఓ నిధులు..

మొత్తం రూ. 650 కోట్ల విలువైన ఈ ఐపీఓలో రూ. 95 కోట్ల విలువైన 31,66,666 కొత్త షేర్లను జారీ చేయగా, రూ. 555 కోట్ల విలువైన 1,85,00,000 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) రూపంలో విక్రయించారు. ఈ ఐపీఓ ఆగస్టు 20న ప్రారంభమై ఆగస్టు 24న ముగిసింది. రీటైల్, క్యూఐబీ ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన ఆదరణ రావడంతో ఈ ఇష్యూ ఏకంగా 184 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ఎలక్ట్రికల్ హీటింగ్, స్పెషలైజ్డ్ కేబుల్స్ విభాగాల్లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (భవిష్యత్ విస్తరణ) కోసం, పాత అప్పులను పాక్షికంగా లేదా పూర్తిగా తీర్చడానికి, మిగిలిన మొత్తాన్ని ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. కంపెనీకి రుణాలు తగ్గడం, వ్యాపార విస్తరణ వేగవంతమవడం వల్ల సుదీర్ఘ కాలంలో కూడా ఈ షేరుపై సానుకూల దృక్పథం కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu