Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐటీ నిపుణులకు అమెరికా షాక్: హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ రద్దు?

ఐటీ నిపుణులకు అమెరికా షాక్: హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ రద్దు?

మెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే కీలక ప్రతిపాదన ఒకటి ముందడుగు వేసింది. లేఆఫ్స్‌లో ఉద్యోగం పోయిన తర్వాత వేరొక కంపెనీని వెతుక్కోవడానికి ఇచ్చే 60 రోజుల 'గ్రేస్ పీరియడ్‌'ను పూర్తిగా రద్దు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) సిద్ధం చేసిన ప్రతిపాదనకు వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది.

ఈ కొత్త నిబంధన తుది రూపు దాల్చితే, హెచ్-1బీ వీసా కలిగిన వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు.

ప్రతిపాదన దశలోనే నిబంధనలు

ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) వద్ద జరిగిన ఈ నిబంధన సమీక్ష వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే ఈ ప్రతిపాదనను 'ఫెడరల్ రిజిస్టర్‌'లో ప్రచురిస్తారు. ఆ తర్వాత సాధారణంగా 30 నుంచి 60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. కంపెనీల స్పాన్సర్‌షిప్‌పై ఆధారపడి అమెరికాలో నివసిస్తున్న విదేశీ నిపుణులకు ఇది అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.

60 రోజుల గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి?

2017లో నాన్-ఇమ్మిగ్రెంట్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సౌకర్యార్థం ఈ 60 రోజుల వెసులుబాటును ప్రవేశపెట్టారు. ఏదైనా కారణంతో ఉద్యోగం పోయినప్పుడు, అమెరికాలోనే ఉంటూ మరొక ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి లేదా వీసాను వేరొక కంపెనీకి బదిలీ చేసుకోవడానికి ఈ సమయం ఉపకరిస్తుంది.

ఈ నిబంధన హెచ్-1బీతో పాటు హెచ్-1బీ1, ఎల్-1, ఓ-1, ఈ-1, ఈ-2, ఈ-3, టీఎన్ వీసాదారులకు వర్తిస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమయాన్ని తగ్గించే లేదా తిరస్కరించే అధికారం డీహెచ్‌ఎస్‌కు ఉన్నప్పటికీ, అధికారులు ఇప్పటివరకు ఆ అధికారాన్ని అరుదుగానే ఉపయోగించారు.

గ్రేస్ పీరియడ్ రద్దయితే పరిణామాలు ఎలా ఉంటాయి?

ఈ కొత్త ప్రతిపాదన చట్టంగా మారితే, ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులకు లభించే రక్షణ కవచం తొలగిపోతుంది. ఉద్యోగం ముగిసిన వెంటనే వారు అమెరికాను విడిచి వెళ్లాల్సి రావచ్చు. వేరే వీసా కేటగిరీకి మారడం లేదా యుఎస్సీఐఎస్ (USCIS) ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం మినహా వేరే మార్గం ఉండదు.

హెచ్-1బీ ఉద్యోగుల వీసా హోదా పూర్తిగా వారి ఉద్యోగంతోనే ముడిపడి ఉంటుంది. ప్రస్తుత విధానంలో కొత్త కంపెనీని వెతుక్కోవడానికి కొంత సమయం లభిస్తుండగా, నిబంధన రద్దయితే మరో ఉద్యోగాన్ని సాధించడం, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం అసాధ్యంగా మారుతుంది.

భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం

అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల సంఖ్యే అత్యధికం. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా ఏకంగా 71 శాతంగా ఉంది. అందువల్ల గ్రేస్ పీరియడ్ రద్దు నిర్ణయం టెక్నాలజీ, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులపైనే ఎక్కువ దెబ్బ కొడుతుంది.

కుటుంబాలపై పడే మానసిక, ఆర్థిక భారం

ఈ ప్రభావం కేవలం ఉద్యోగిపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపైనా పడుతుంది. హఠాత్తుగా ఉద్యోగం పోయినప్పుడు, దేశం విడిచి వెళ్లడానికి తగిన సమయం లేకపోతే ఇళ్ల అద్దె ఒప్పందాలు ముగించడం, పిల్లల పాఠశాలల నుంచి బదిలీ పత్రాలు తీసుకోవడం, వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడం తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది.

"60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించడం మానవత్వం లేని చర్య. అమలు సాధ్యం కాని నిర్ణయం" అని వైట్‌హౌస్ మాజీ సలహాదారు అజయ్ జైన్ భుటోరియా విమర్శించారు. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన ప్రతిభావంతుడికి 60 రోజుల సమయమే చాలా తక్కువని, దానిని రద్దు చేయడానికి బదులుగా 180 రోజులకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. "తమ ఇళ్ల లీజులను ముగించుకోవడానికి, పిల్లలను పాఠశాలల నుంచి మార్చడానికి లేదా వ్యక్తిగత వ్యవహారాలను చూసుకోవడానికి కూడా ప్రజలకు సమయం దొరకదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా తుది నిర్ణయం కాలేదు

అయితే, ఈ గ్రేస్ పీరియడ్ ఇంకా రద్దు కాలేదని గమనించాలి. వైట్‌హౌస్ సమీక్ష మాత్రమే పూర్తయింది. ప్రతిపాదన ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమైన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాతే ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయడమో లేదా తుది ఉత్తర్వులు ఇవ్వడమో చేస్తుంది. అయినప్పటికీ, ప్రతిపాదన ఆమోదం పొందితే మాత్రం ఉద్యోగం పోయిన మరుక్షణమే భారతీయ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సంక్షోభం ఎదరుకాక తప్పదు.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu