కలియుగ వైకుంఠం తిరుమల కొండపై భక్తుల వసతి రద్దీని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఒక భారీ వ్యూహాత్మక ప్రాజెక్టును వేగవంతం చేసింది.
తిరుపతిలోని అలిపిరి పాదాల చెంత అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పిరిచువల్ పిల్‌గ్రిమ్ టౌన్‌షిప్(Integrated Spiritual Pilgrim Township) నిర్మాణానికి టీటీడీ బోర్డు అధికారికంగా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ ప్రాజెక్టు పనుల పురోగతి, శంకుస్థాపన ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడును కలిసి సుదీర్ఘంగా చర్చించారు. టౌన్‌షిప్ నిర్మాణం కోసం అలిపిరి వద్ద భూమిని కూడా ఖరారు చేశారు. అలిపిరి గరుడ సర్కిల్‌కు ముందు దాదాపు 30 ఎకరాలు, గరుడ సర్కిల్ దాటిన తర్వాత ఎస్వీ జూ పార్క్ రోడ్డు వైపు మరో 45 ఎకరాల భూమిని (మొత్తం సుమారు 75 ఎకరాలు) సేకరించారు.
ఈ టౌన్‌షిప్ ప్రస్తుత జూ పార్క్ రోడ్డుకు ఎడమ వైపున ఉంటుంది. ఇక్కడి నుండి భక్తులు రోడ్ అండర్ బ్రిడ్జ్ ద్వారా నేరుగా అలిపిరి టోల్‌గేట్‌కు చేరుకునేలా లింక్ రోడ్డును డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టును తిరుమల కొండకు ఒక హైటెక్ బేస్ క్యాంప్ లాగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల కొండపై గదుల కొరత సమస్య పూర్తిగా తొలగిపోనుంది.
తిరుమలకి వచ్చే భక్తులకు అలిపిరి పాదాల చెంతే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలిన ఒక అద్భుతమైన ప్రతిరూపాన్ని ఇక్కడ నిర్మించనున్నారు. ఒకేసారి 20,000 నుండి 25,000 మంది భక్తులు బస చేసేలా, అన్ని రకాల సదుపాయాలను పొందేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభ వ్యయం రూ.100 కోట్ల నుండి రూ. 600 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. సాంప్రదాయ ద్రావిడ శిల్పకళా వైభవం ఉట్టిపడేలా బాహ్య రూపాన్ని అందిస్తూనే, లోపల ఎక్కువ మంది పట్టేలా హై-డెన్సిటీ వర్టికల్ లాడ్జింగ్ సదుపాయాలను కల్పిస్తారు.
తిరుమలకు ప్రతిరోజూ 70 వేల నుండి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం కొండపై వసతి గదుల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దే ఇంతటి భారీ టౌన్‌షిప్ నిర్మించడం వల్ల భక్తులు కొండ కిందనే డిజిటల్ లాకర్లు, వసతి, ఉచిత భోజన సదుపాయాలు పొంది, కేవలం దర్శన సమయానికి మాత్రమే కొండపైకి వెళ్లే వెసులుబాటు కలుగుతుంది.
ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కఠినమైన గడువులను విధించుకుంది. ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌ల నుండి సాంకేతిక, డిజైన్ ప్రతిపాదనలను టీటీడీ ఇప్పటికే ఆహ్వానించింది.
Anand Sai, Tirupati

