ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే కానుకగా ఈ చిత్రానికి 'రాకా' (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. "ఇది కేవలం సినిమా కాదు, నాలో ఒక భాగం. దాదాపు 18 ఏళ్లుగా ఈ ఐడియాను నా మనసులోనే దాచుకున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ కథ రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే," అంటూ అట్లీ తన ఆనందాన్ని పంచుకున్నారు.
గగుర్పాటు కలిగించే లుక్.. బన్నీ రిస్క్ చేస్తున్నారా?
రాకా పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ అత్యంత భయంకరంగా, ఊహకందని విధంగా ఉంది. కళ్లకు దట్టమైన కాటుక, గుండు, నెరిసిన గడ్డం, మీసాలతో బన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అన్నింటికంటే ముఖ్యంగా, అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు తరహాలో ఉండే గోర్ల చేత్తో కవర్ చేసుకోవడం ఈ సినిమా 'సైన్స్ ఫిక్షన్' (Sci-Fi) నేపథ్యమని స్పష్టం చేస్తోంది.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండి, వరుస కమర్షియల్ హిట్లు కొడుతున్న సమయంలో ఇలాంటి డీ-గ్లామర్, ప్రయోగాత్మక పాత్రను ఎంచుకోవడం అల్లు అర్జున్ ధైర్యానికి నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే, మరోవైపు రాకా టైటిల్, అల్లు అర్జున్ లుక్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
'ఐ' నుంచి 'శక్తి' దాకా.. కాపీ ఆరోపణలు!
రాకా పోస్టర్ రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమన్నాయి. బన్నీ లుక్ చూస్తుంటే గతంలో వచ్చిన కొన్ని సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విక్రమ్ 'ఐ' మూవీ: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' సినిమాలో విక్రమ్ లుక్‌ను ఇది పోలి ఉందని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెడుతున్నారు.
కార్తీ 'కాశ్మోరా': కార్తీ నటించిన 'కాశ్మోరా' (Kaashmora) సినిమాలోని విలన్ లుక్‌ను అల్లు అర్జున్ కాపీ కొట్టారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.
శక్తి సినిమా విలన్: ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమాలో విలన్ పేరు కూడా 'రాకా' (Daniel Kaleb పాత్ర). దీంతో టైటిల్‌తో పాటు లుక్ కూడా అక్కడి నుంచే తీసుకున్నారా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మెర్సల్, కాశ్మోరా సినిమాల మిశ్రమమే ఈ 'రాక' అని రెడ్డిట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో చర్చ నడుస్తోంది.
దీపికా పదుకొణె హీరోయిన్
సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న రాకా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, దీపికా జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
2027లో ప్రపంచవ్యాప్తంగా
అయితే, అల్లు అర్జున్-దీపికా పదుకొణె- అట్లీ కాంబినేషన్ మూవీ రాకా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

