AP Cabinet Decisions 2026: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (ఏప్రిల్ 30, 2026) 48వ మంత్రివర్గ సమావేశం జరిగింది.
ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, పోలవరం నిర్వాసితులకు అండగా నిలవడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం అనంతరం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఏపీ కేబినెట్ - నిర్ణయాలు:
- రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. అమరావతి సచివాలయ టవర్లకు గ్లాస్ క్లాడింగ్, పివి ప్యానెల్స్ వంటి అత్యాధునిక హంగుల కోసం రూ. 2,540 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపారు.
- క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి రూ. 1,208 కోట్లు, శాసనసభ భవనంలో పెండింగ్ పనులకు రూ. 798 కోట్లు కేటాయించారు. అలాగే ఉండవల్లి పరిధిలోని లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి వసతుల కోసం రూ. 580 కోట్లు మంజూరు చేశారు.
- కృష్ణా నది వరద నిరోధక కట్టల బలోపేతానికి రూ. 443 కోట్లు కేటాయించి…. కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం.
- పోలవరం ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) ఎంచుకున్న వారికి ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 2.85 లక్షల నుండి రూ. 3.57 లక్షలకు పెంచారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలు కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఇచ్చే స్థలం విలువను రూ. లక్ష నుండి రూ. 2 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2022-23 నాటి సవరించిన ధరల ప్రకారం ఈ పెంపు అమలు చేయనున్నారు.
- హోం శాఖలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF)లో 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు 385 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు.
- న్యాయ శాఖలో 21 కొత్త కోర్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో కూడా మరికొన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
- దేశ రాజధానిలో రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా రూ. 124.50 కోట్లతో నూతన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఎన్‌బిసిసి (NBCC) సంస్థకు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.
- ప్రకాశం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో వ్యత్యాస పనుల కోసం అదనంగా రూ. 354 కోట్లు మంజూరు చేశారు.
- శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో డిఫెన్స్ పరిశ్రమ స్థాపన కోసం 600 ఎకరాల భూమిని కేటాయించారు.
- శ్రీకాకుళం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 1,586 కోట్లు కేటాయింపు.
- రబీ సీజన్‌లో వరి సేకరణ కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ. 1800 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కిసాన్ డ్రోన్ పథకాన్ని 2025-26లో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలు ఏకరూపంగా ఉండేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Maheshwaram Mahendra Chary

