రాష్ట్రంలో 13,100 పంచాయతీల్లోని పాలకమండలి పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిసింది. దీంతో ఇవాళ్టి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మరో 250 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర కారణాలతో అప్పట్లో ఎన్నికలు జరగలేదు.
సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు నియమితులుయ్యారు. వీరంతా శుక్రవారం(ఏప్రిల్ 3) ఛార్జ్ తీసుకున్నారు. తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేకాధికారులుగా ఎమ్మార్వోలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో), మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారుల(ఈవో) సేవలు అందించనున్నారు.
త్వరలోనే స్థానిక ఎన్నికలు..!
మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల పాలకమండలి పదవీ కాలం ముగిసిన ఈసీ కూడా వేగం పెంచనుంది. ఇప్పటికే గత కొంత కాలంగా ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాలు ప్రచురితమయ్యాయి. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి…. ఎక్కడా పొరపాట్లు లేకుండా ఈసీ చర్యలు తీసుకుంది.
మరోవైపు సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈసీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది.
సర్పంచ్ ఎన్నికలు రాబోతున్న వేళ గ్రామాల్లోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వాళ్లు… పావులు కదిపే పనిలో పడ్డారు. రిజర్వేషన్ల ఖరారు అయితే… పోటీపై మరింత స్పష్టతకు రానున్నారు. ఇక మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రధాన పార్టీలలో పని చేస్తున్న పలువురు నేతలు… ఇప్పట్నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Maheshwaram Mahendra Chary

