Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP One App : ప్రభుత్వ సేవలు మరింత సులభం - త్వరలోనే 'ఏపీ ఒన్' యాప్..! 150 సేవలతో...

AP One App : ప్రభుత్వ సేవలు మరింత సులభం - త్వరలోనే 'ఏపీ ఒన్' యాప్..! 150 సేవలతో...

ఆంధ్రప్రదేశ్‌లో పౌరులకు ప్రభుత్వ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా, నేరుగా ఆన్‌లైన్ ద్వారానే అందించడమే లక్ష్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) మరో అడుగు ముందుకు వేయనుంది.

ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న 'ఏపీ ఒన్' (AP One) మొబైల్ అప్లికేషన్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ యాప్ వినియోగంపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం అమరావతిలో సీఈఓ ప్రఖర్ జైన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ మాట్లాడుతూ….. సాధారణ ప్రజలు చిన్నా చితకా ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చూడాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద నుంచే, ఉన్న చోటు నుంచే ప్రతి సేవను పొందే వాతావరణాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్‌కు పౌరుల నుంచి అద్భుతమైన ప్రజాదరణ లభించిందని తెలిపారు. ఈ వాట్సాప్ వేదిక ద్వారా ఇప్పటికే 1,000కి పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసినట్లు వివరించారు.

త్వరలో 150 సేవలతో 'ఏపీ ఒన్' యాప్….

వాట్సాప్ సేవలకు అదనంగా, ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా ఒక సమగ్ర మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగానే 'ఏపీ ఒన్' మొబైల్ యాప్‌ను ఆర్టీజీఎస్ సిద్ధం చేస్తోందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఈ యాప్‌ను అతిత్వరలోనే అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభ దశలో 150 రకాల కీలక సేవలను ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తారు. రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవల సంఖ్యను మరింత పెంచుకుంటూ వెళ్తామని సీఈఓ వివరించారు.

గతంలో ఒక కుల ధ్రువీకరణ పత్రం లేదా ఇతర సర్టిఫికెట్ కావాలన్నా…. నూతన విద్యుత్ కనెక్షన్ పొందాలన్నా దరఖాస్తు ప్రక్రియలు ఎంతో సంక్లిష్టంగా ఉండేవి. అటువంటి పాత, క్లిష్టమైన పద్ధతులకు స్వస్తి పలుకుతూ, ఆధునిక సాంకేతికత సాయంతో సేవలను ప్రజలకు అత్యంత సరళంగా అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ యాప్‌ను ప్రజలు సులభంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక సెర్చ్ బార్ సదుపాయాన్ని కల్పించారు. దీనిని తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ వినియోగించుకోవచ్చు. వివిధ రకాల ప్రభుత్వ ధ్రువపత్రాలను నేరుగా ఈ యాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

ప్రభుత్వ అధికారులు సైతం ఈ నూతన సాంకేతికతపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు ఈ యాప్ ద్వారా చేకూరే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వివరించి అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu