రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2026 - 2027 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు.
ఏప్రిల్ 9 చివరి తేదీ…
ఇప్పటికే ఏపీ పాలిసెట్ - 2026 దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ గడువు కూడా రేపటితో (ఏప్రిల్ 9) ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు… వెంటనే ఆన్ లైన్ ద్వారా దఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండదని.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.
ఏపీ పాలిసెట్ - 2026 అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఏపీ పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా గతేడాదిలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అర్హులవుతారు.
ఏప్రిల్ 25న ఎగ్జామ్….
ఏపీ పాలిసెట్ - 2026 పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిర్వహణకు 7 రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది కీలతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.
ఏపీ పాలిసెట్ - దరఖాస్తు విధానం
- ముందుగా https://polycetap.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
- హోం పేజీలోని ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్ లేదా పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్ ను పొందొచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
ప్రశ్న: ఏపీ పాలిసెట్ 2026 దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?
జవాబు: పొడిగించిన గడువు ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ దరఖాస్తుకు చివరి అవకాశం.
ప్రశ్న: ఏపీ పాలిసెట్ పరీక్ష ఏ తేదీన జరుగుతుంది?
జవాబు: ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ప్రశ్న: పదో తరగతి రిజల్ట్స్ రాకున్నా అప్లై చేయవచ్చా?
జవాబు: అవును, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
ప్రశ్న : పాలిటెక్నిక్ పూర్తి చేస్తే అవకాశాలు ఉంటాయా..?
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రతి ఏటా ప్రాంగణ నియామకాలు చేపడుతుంటారు. వివిధ కంపెనీల ప్రతినిధులు కళాశాలకే వచ్చి విద్యార్థులను మంచి ప్యాకేజీలకు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయి.
Maheshwaram Mahendra Chary

