AP POLYCET 2026 Results : ఏపీ పాలిసెట్ - 2026 ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు కేంద్రాల్లో పాలిసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. పరీక్ష జరిగిన రెండు రోజులకే, అంటే ఏప్రిల్ 27న ప్రాథమిక కీ (Preliminary Key) విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఇప్పుడు తుది కీతో పాటు ఫలితాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,77,581 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా… మొత్తం 1,63,008 మంది హాజరయ్యారు. వీరిలో మొత్తం 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37 శాతంగా నమోదైంది.
ఈ ఫలితాల్లో బాలికలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. బాలికల ఉత్తీర్ణత శాతం 93.57 శాతంగా ఉంది.
- అల్లూరి సీతారామరాజు జిల్లా: 99.11 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
- పోలవరం: 95.46 శాతం ఉత్తీర్ణత సాధించింది.
- పార్వతీపురం మన్యం: 93.45 శాతంతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి?
ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in లేదా polycetap.ap.gov.in ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే 'ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
- వివరాలు సరిచూసుకుని సబ్మిట్ బటన్ నొక్కండి.
- మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
ఇక ఏపీ పాలిసెట్ ఫలితాలు మనమిత్ర వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లోనే మీ ర్యాంక్ కార్డును చెక్ చేసుకోవచ్చు.
- మీ మొబైల్‌లో 'మన మిత్ర' అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ ఓపెన్ చేసి…. ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
- వెంటనే మీకు వచ్చే ఆప్షన్లలో "ఎడ్యుకేషన్ సర్వీసెస్" ఎంచుకోండి.
- ఆ తర్వాత "ఏపీ పాలిసెట్ ఫలితాలు 2026" పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద కనిపిస్తుంది..
ఏపీ పాలిసెట్ పరీక్షలో మొత్తం 120 మార్కులకు గాను కనీసం 25 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. అంటే…. జనరల్ కేటగిరీ విద్యార్థులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ఎలాంటి కనీస మార్కుల నిబంధన లేదు. వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకును కేటాయిస్తారు.
ఫలితాలు విడుదల కావటంతో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఈ ర్యాంకుల ఆధారంగానే జరుగుతుంది. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.
Maheshwaram Mahendra Chary

