ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET - June 2026) అప్లికేషన్లలో తప్పులు దొర్లి ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది.
ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునేందుకు వీలుగా 'వన్-టైమ్ డిలీట్' (One-Time Delete Option) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ ఈ ఏడాది జూన్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి జూలై 5, 2026ని చివరి తేదీగా నిర్ణయించారు. అయితే చాలా మంది అభ్యర్థులు అప్లికేషన్ పూరించే సమయంలో పేరు, విద్యార్హతలు, పుట్టిన తేదీ లేదా ఫోటో, సంతకం వంటి వివరాలను తప్పుగా నమోదు చేశామని, వాటిని మార్చుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ వన్-టైమ్ డిలీట్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమ పాత (తప్పులున్న) దరఖాస్తును డిలీట్ చేసి, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా మళ్లీ కొత్తగా సరైన వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే లభిస్తుందని, కాబట్టి ఈసారి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వివరాలను పరిశీలించుకుని అప్లై చేయాలని కన్వీనర్ సూచించారు.
టెట్ జూన్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 5 చివరి తేదీ. చివరి నిమిషంలో సర్వర్ డౌన్ లేదా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టెట్ పరీక్ష అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారింది.
ఏపీ టెట్ ముఖ్యమైన తేదీలు చూసుకుంటే.. పరీక్షలు 05-08-2026 నుంచి 21-08-2026 వరకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో ఉంటాయి. 25-07-2026 నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ 24-08-2026న విడుదల అవుతుంది. 25-08-2026 నుంచి 31-08-2026 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ 08-09-2026 విడుదల అవుతుంది. ఫలితాలను 15-09-2026 విడుదల చేస్తారు.
Anand Sai

