AP Vehicle Registration : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసేలా వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు సీఎం ఆమోదాన్ని(గ్రీన్ సిగ్నల్) తెలియచేశారు.
వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు.
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందించే పౌరసేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత పెంచేందుకు, సమర్ధంగా వినియోగించేందుకు వీలుగా నిపుణులతో కూడిన సలహా మండలి ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచేలా ఓ వర్క్‌షాప్ నిర్వహించాలని సీఎం సూచించారు. మైనింగ్ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్న తీరును అధ్యయనం చేసి ఏపీలోనూ అమలు చేసేలా చూడాలన్నారు. అవేర్ సాంకేతికతను వినియోగించుకుని వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురి కాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్‌ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వచ్చంధ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు.
అన్నీ ఆన్ లైన్లోనే….
ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించే వివిధ పౌర సేవలు మెరుగ్గా అందించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవల్లో మెరుగైన ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్ కనెక్ట్ అనేది కీలకమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని, క్రెడిబిలిటీని పెంచేలా ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
"ప్రతీ ప్రభుత్వ శాఖ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్టుగా పనిచేయాల్సిందే. పంటలకు ధర విషయంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ ను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించేలా సీనియర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. కార్యదర్శుల స్థాయి అధికారులు నెలలో 3 రోజుల పాటు, హెచ్ ఓడీలు 6 రోజుల పాటు, జిల్లా కలెక్టర్లు 8 రోజుల పాటు 7 క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలి" అని సీఎం ఆదేశించారు.
ప్రజాభిప్రాయ సేకరణ కోసం కాల్ సెంటర్ ద్వారా వివరాలను సేకరించాలని సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఉత్తమ విధానాలు అనుసరించాలన్నారు. అధికారులు ఏ అంశంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారో అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయని.. మిగిలిన చోట్ల కూడా ఇదే చొరవ చూపాలన్నారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ శాఖలు అందించే మిగతా అన్ని సేవల్ని ఆన్ లైన్ లో అందించాలని స్పష్టం చేశారు.
Maheshwaram Mahendra Chary

