AP Weather Update : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడమే కాకుండా… ప్రజలను ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఒకవైపు తీవ్రమైన వేడి గాలులు, మరోవైపు అకస్మాత్తుగా కురుస్తున్న పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ విభిన్న వాతావరణ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక ప్రకటన విడుదల చేశారు.
గూడూరులో రికార్డు ఉష్ణోగ్రత…
ఆదివారం రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింతస్థాయికి చేరింది. నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు, మార్కాపురం కంభంలో 45.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల్లోని 286 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాయలసీమ నుంచి కోస్తా వరకు ఎండల సెగలు కొనసాగుతున్నాయి.
ఇవాళ 27 మండలాల్లో వడగాల్పులు…
రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా కింది మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు:
- విజయనగరం జిల్లా: బొబ్బిలి, వంగర మండలాలు.
- పార్వతీపురం మన్యం జిల్లా: బలిజపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, వీరఘట్టం.
- పోలవరం జిల్లా: చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం.
- ఏలూరు జిల్లా: వేలేరుపాడు.
- ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం, కంచికచర్ల.
- గుంటూరు జిల్లా: మంగళగిరి, మెడికొండూరు, ఫిరంగిపురం, తాడికొండ, తాడేపల్లి, తుళ్లూరు.
- పల్నాడు జిల్లా: అమరావతి, పెదకూరపాడు.
- నెల్లూరు జిల్లా: మనుబోలు, గూడూరు.
ద్రోణి ప్రభావంతో వర్షాలు
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. "ఈ ద్రోణి ప్రభావంతో సోమవారం కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది," అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పిడుగుల పట్ల రైతులు, పశువుల కాపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండటం ప్రమాదకరమని, ముఖ్యంగా చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. ఆదివారం సాయంత్రం ముమ్మిడివరంలో 72.7 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎండలు, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
Maheshwaram Mahendra Chary

