Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ather Konarc : ఏథర్​ నుంచి బడ్జెట్​ ఎలక్ట్రిక్ స్కూటర్- 'కోనార్క్' లాంచ్ డేట్ ఫిక్స్..

Ather Konarc : ఏథర్​ నుంచి బడ్జెట్​ ఎలక్ట్రిక్ స్కూటర్- 'కోనార్క్' లాంచ్ డేట్ ఫిక్స్..

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. ఈఎల్​01 ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఎలక్ట్రిక్​ స్కూటర్​ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను సంస్థ తాజాగా పంచుకుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో పంచుకున్నారు. ఈ వీడియో ద్వారా కంపెనీ ఈ వాహనానికి 'కోనార్క్' అని నామకరణం చేసినట్లు స్పష్టమైంది.

ప్రతి ఏటా ఏథర్ నిర్వహించే 'ఏథర్ కమ్యూనిటీ డే' ఈవెంట్‌లో భాగంగా ఆగస్టు 29, 2026న ఈ సరికొత్త ఈ-స్కూటర్‌ను సంస్థ అధికారికంగా మార్కెట్లోకి ఆవిష్కరించనున్నారు.

తాజాగా విడుదలైన ఈ టీజర్ వీడియోలో.. ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కీలక ఎక్స్​టీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ముందు- వెనుక భాగాల్లో యూ-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ముందు వైపు డిస్క్ బ్రేక్, ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో 14-ఇంచ్ సైజు కలిగిన 90/90 సెక్షన్ టైరును ఉపయోగించినట్లు తెలుస్తోంది.

వినూత్నమైన కొత్త ప్లాట్‌ఫారమ్..

ఏథర్ తయారు చేసిన సరికొత్త 'ఈఎల్ ప్లాట్‌ఫారమ్' ఆధారంగా ఈ స్కూటర్ రూపుదిద్దుకుంది. ఈ మోడ్యులర్ ఆర్కిటెక్చర్ భవిష్యత్తులో వివిధ రకాల డిజైన్లు, బాడీ స్టైల్స్ కలిగిన స్కూటర్ల తయారీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ 2 kWh నుంచి 5 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌లకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. దీనివల్ల ఏథర్ రాబోయే రోజుల్లో వేర్వేరు ధరల శ్రేణిలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా అనేక మోడళ్లను తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది.

గత ఏడాది కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఏథర్ తొలిసారిగా ఈఎల్01 కాన్సెప్ట్ స్కూటర్‌ను ప్రదర్శించింది. స్మూత్ బాడీ ప్యానెల్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, ప్రయాణికులకు అనువుగా ఉండేలా వెనుక వైపు కాస్త ఎత్తుగా ఉండే పొడవైన సింగిల్-పీస్ సీట్‌తో ఇది లభించనుంది.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత ఉండొచ్చు?

ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతున్న ఈ ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సంస్థ లైనప్‌లోనే అత్యంత సరసమైన (బడ్జెట్ ఫ్రెండ్లీ) మోడల్‌గా నిలవనుంది. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఏథర్‌కు ఇది కీలకమైన అడుగు అని చెప్పవచ్చు.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్- హార్డ్‌వేర్, ఇతర ఫీచర్లు..

కంపెనీ ఇంకా పూర్తి సాంకేతిక వివరాలను ధ్రువీకరించనప్పటికీ, రోడ్డుపై పరీక్షల సమయంలో కనిపించిన స్పెసిఫికేషన్ల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు వైపు 14-ఇంచ్, వెనుక వైపు 12-ఇంచ్ అలాయ్ వీల్స్ ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ కాంబినేషన్‌ను ఖరారు చేశారు. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, ఇతర స్మార్ట్ ఫీచర్లను సపోర్ట్ చేసే 7-ఇంచ్ టీఎఫ్‌టీ డిస్​ప్లేని కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu