Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉందాని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.

ప్రస్తుతం సముద్రమట్టంలో నైరుతి రుతుపవనాల ద్రోణి అమృత్‌సర్, పటియాలా, నజీబాబాద్ మీదుగా పయనిస్తోంది. ఉత్తర కోస్తా ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైన ఈ అల్పపీడన కేంద్రం గుండా ద్రోణి వెళుతూ, తూర్పు-మధ్య బంగాళాఖాతం వైపు ఆగ్నేయ దిశగా విస్తరిస్తోంది.

సెప్టెంబరు 7 వరకు హెచ్చరికలు

ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. సెప్టెంబరు 7 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే కొద్ది రోజులు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీ, తెలంగాణలో వర్ష సూచన

మంగళవారం నుండి కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉపరితల గాలుల ప్రభావం ఎక్కువ ఉండనుంది.

అల్పపీడనం, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు తమ పంట పొలాల్లో నిలిచిన నీటిని తొలగించే ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తీరప్రాంతాల్లో అలల ఉధృతి, గంటకు 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu