"బీజేపీ ఎన్ని సీట్లలో సీరియస్‌గా పోటీ చేస్తోంది?" అనే ప్రశ్నకు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మంజేశ్వరం అభ్యర్థి కే సురేంద్రన్ ఘాటుగా సమాధానమిచ్చారు.
"మేము కేవలం కొన్ని సీట్ల కోసం పోటీ చేయడం లేదు, మొత్తం 140 స్థానాల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా రంగంలోకి దిగుతున్నాము," అని ఆయన పేర్కొన్నారు. కేరళ రాజకీయాల్లో తమను ఇకపై ఒక చిన్న పార్టీగా చూడలేమని బీజేపీ ఇస్తున్న సంకేతం ఇది.
కేరళపై పట్టు సాధించాలన్న బీజేపీ కల ఈ 2026 అసెంబ్లీ ఎన్నికలతో నిజం అవుతాయా?
కేరళ అసెంబ్లీ ఎన్నికలు- 30 నుంచి 40 సీట్లలో నిర్ణయాత్మక శక్తి!
తిరువనంతపురం మొదటి బీజేపీ మేయర్ వీవీ రాజేష్ విశ్లేషణ ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గతంలోనే 35,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. త్రిముఖ పోటీ జరిగే ఈ స్థానాల్లో మరో 10,000 ఓట్లు పెంచుకోగలిగితే విజయావకాశాలు బీజేపీ చెంతకు చేరుతాయి. కనీసం ఒక డజను స్థానాల్లో బీజేపీ అత్యంత గట్టి పోటీనిస్తోంది. ఈ సీట్లలో పార్టీ ఏమాత్రం ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించినా కేరళ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు- గణాంకాలు ఏం చెబుతున్నాయి?
1980లో స్థాపించినప్పటి నుంచి బీజేపీ కేరళలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే (2016), ఒకే ఒక ఎంపీ (2024) స్థానాన్ని గెలుచుకుంది. అయితే ఓట్ల శాతం మాత్రం నిలకడగా పెరుగుతూ వస్తుండటం పార్టీకి ఊరటనిచ్చే విషయం.
అసెంబ్లీ ఎన్నికలు: 2011లో 6.03% నుంచి 2021 నాటికి 11.3%కి చేరింది.
లోక్‌సభ ఎన్నికలు: 2014లో 10.3% నుంచి 2024 నాటికి 16.7%కి పెరిగింది.
కేరళ ఓటర్లు జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపే తీరును గమనిస్తే, అసెంబ్లీ కంటే లోక్‌సభ ఎన్నికల్లోనే బీజేపీకి ఎక్కువ ఆదరణ లభిస్తోందని అర్థమవుతుంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు- బీజేపీకి ఎందుకు క్రేజ్ పెరుగుతోంది?
కేంద్ర అధికారం, ప్రాబల్యం: 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కేరళ ఓటర్లకు బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. గతంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ లు మాత్రమే ఇచ్చే 'ప్యాట్రోనేజ్' (ఆర్థిక, సామాజిక మద్దతు) ఇప్పుడు దిల్లీ అధికారం ద్వారా బీజేపీ కూడా ఇవ్వగలుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
హిందూ ఓట్ల సమీకరణ: కేరళలో 54% ఉన్న హిందూ జనాభా వివిధ కులాలు, పార్టీల పరంగా విడిపోయి ఉన్నారు. సీపీఐ(ఎం) కు పడే హిందూ ఓట్లలో బీజేపీ ఇప్పుడు నెమ్మదిగా చీలిక తెస్తోంది. కులాలకు అతీతంగా ఒక 'పాన్-హిందూ' ఓటు బ్యాంకును సృష్టించే పనిలో పార్టీ నిమగ్నమైంది.
సామాజిక ఇంజనీరింగ్: ఈళవ సామాజిక వర్గానికి చెందిన బీడీజేఎస్ పార్టీతో పొత్తు, అలాగే మధ్య- దక్షిణ కేరళలో క్రైస్తవ వర్గాలను ఆకర్షించడం బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన అనూప్ ఆంటోనీ వంటి యువ నాయకులను ప్రోత్సహించడం ద్వారా బీజేపీ దీర్ఘకాలిక పెట్టుబడి పెడుతోంది.

కేరళ అసెంబ్లీ ఎన్నికలు- కీలక బీజేపీ అభ్యర్థులు, హాట్ సీట్లు..
ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బీజేపీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు:
నేమం : రాజీవ్ చంద్రశేఖర్ (రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు)
కజక్కూటం : వీ. మురళీధరన్ (మాజీ కేంద్ర మంత్రి)
పాలక్కాడ్ : శోభా సురేంద్రన్ - ఈమె పార్టీలో అత్యంత శక్తివంతమైన ప్రచారకర్త.
మంజేశ్వరం : కే. సురేంద్రన్ - గతంలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఇక్కడ ఓడిపోయారు.
త్రిసూర్ : పద్మజ వేణుగోపాల్ (మాజీ సీఎం కే. కరుణాకరన్ కుమార్తె)
వట్టియూర్కావు: శ్రీలేఖ (కేరళ మొదటి మహిళా డీజీపీ)
కేరళ అసెంబ్లీ ఎన్నికలు- మతం, సంస్కృతి..
గత కొన్ని దశాబ్దాలుగా కేరళలో హిందూ మతపరమైన కార్యక్రమాలు, ఆలయాల పునరుద్ధరణ, ఆచారాల పునరుద్ధరణ పెరిగింది. శబరిమల నిరసనలు, ఆట్టుకల్ దేవి ఆలయ ఉత్సవాలు బీజేపీకి మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టడంలో సహాయపడ్డాయి. ఆలయ ఉత్సవాలు, భజన కార్యక్రమాలు ఇప్పుడు బీజేపీకి కొత్త మద్దతుదారులను చేర్చుకునే వేదికలుగా మారాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు- బీజేపీకి ఉన్న సవాళ్లు ఏంటి?
హిందూ ఓట్ల సమీకరణ వల్ల కొన్నిసార్లు ఎల్‌డీఎఫ్ వ్యతిరేక ఓట్లు యూడీఎఫ్కి మళ్లే అవకాశం ఉంటుంది. అలాగే 'కేరళ స్టోరీ' వంటి సినిమాలు, ఆహారపు అలవాట్లపై చేసే ప్రచారాలు బీజేపీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు- బీజేపీ సత్తా చాటుతుందా?
కేరళలో ఎప్పుడూ సాగే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరాటాన్ని బీజేపీ ఇప్పుడు ఒత్తిడికి గురి చేస్తోంది. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో.. బీజేపీ సాధించే కొన్ని సీట్లు ఆ పార్టీని కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. 2026 ఎన్నికలు కేరళ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు కానున్నాయా? అనేది ఫలితాల తర్వాత తేలనుంది.
140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
Chitturi Eswara Karthikeya Sharath

