Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొండాడ ఇంజనీరింగ్ ధమాకా: క్యూ1లో  ₹54 కోట్ల నికర లాభం

బొండాడ ఇంజనీరింగ్ ధమాకా: క్యూ1లో ₹54 కోట్ల నికర లాభం

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) ఆర్థిక ఫలితాలలో రికార్డు వృద్ధి నమోదు చేసింది.

జూన్ 30, 2026తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఏకీకృత (Consolidated) ఆదాయం రూ. 691.65 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధిని సూచిస్తోంది. పునరుత్పాదక ఇంధనం, టెలికామ్, ఈపీసీ (EPC), ఇంజనీరింగ్ సేవల్లో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది.

ఈ త్రైమాసికంలో కంపెనీ లాభదాయకత కూడా గణనీయంగా పెరిగింది. పన్నుకు ముందు లాభం (PBT) 27 శాతం పెరిగి రూ. 72.71 కోట్లకు చేరుకోగా, నికర లాభం (PAT) 29 శాతం వృద్ధితో రూ. 53.94 కోట్లుగా నమోదైంది. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు వ్యయ నియంత్రణ పాటించడం వల్ల కంపెనీ లాభాలు మెరుగయ్యాయి.

స్టాండ్‌అలోన్ ఆదాయంలోనూ జోరు

కంపెనీ స్టాండ్‌అలోన్ వ్యాపారం కూడా బలమైన వృద్ధి రేటును కొనసాగించింది. స్టాండ్‌అలోన్ నిర్వహణ ఆదాయం 23 శాతం పెరిగి రూ. 626.77 కోట్లకు చేరింది. అలాగే నికర లాభం (PAT) 21 శాతం వృద్ధితో రూ. 47.70 కోట్లను తాకింది. ప్రధాన వ్యాపార విభాగాల్లో నమోదు చేసిన ఈ క్రమశిక్షణతో కూడిన వృద్ధి, బొండాడ ఇంజనీరింగ్ మౌలిక సామర్థ్యానికి అద్దం పడుతోంది.

సద్వినియోగానికి సిద్ధం

"2026-27 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఈ బలమైన ఆరంభం మా వ్యాపార నమూనా స్థిరత్వానికి నిదర్శనం. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ మౌలిక వసతులు, టెలికామ్ రంగాల్లో భారతదేశం వేగంగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, మాకున్న విస్తృత ప్రాజెక్టు పైప్‌లైన్‌తో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం" అని బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు తెలిపారు.

ఫలితాలపై కంపెనీ హోల్-టైమ్ డైరెక్టర్ & సీఎఫ్ఓ సీఏ బారటం సత్యనారాయణ మాట్లాడుతూ.. "డిసిప్లిన్డ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ వల్ల క్యూ1లో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. మూలధనాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, ఆరోగ్యకరమైన బాలెన్స్ షీట్‌ను నిర్వహిస్తూ లాభదాయకమైన వృద్ధి దిశగా పయనిస్తున్నాం" అని వివరించారు.

మౌలిక రంగంలో వేగవంతమైన పురోగతి

2012లో ప్రారంభమైన బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ (BSE: 543971) గడిచిన 14 ఏళ్లలో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భాగస్వామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆధునిక ఉత్పాదక యూనిట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టెలికామ్, గ్రీన్ ఎనర్జీ, రైల్వేస్ రంగాల్లో కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తూ దేశీయ ఇంజనీరింగ్ విభాగంలో తన ఉనికిని చాటుకుంటోంది.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu