Dailyhunt
Brahmamudi May 4 Episode: బ్రహ్మముడి- వీలునామా మార్పించిన రాజ్, కావ్య- రేఖకు దిమ్మతిరిగే షాక్- ఇందు పెళ్లితో మెలిక!

Brahmamudi May 4 Episode: బ్రహ్మముడి- వీలునామా మార్పించిన రాజ్, కావ్య- రేఖకు దిమ్మతిరిగే షాక్- ఇందు పెళ్లితో మెలిక!

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడు, స్వరాజ్ గ్రూప్ ఎండీ రాజ్ అక్క కొడుకు, కోట్ల ఆస్తికి అధిపతి అని చలపతి, లక్ష్మీలకు శ్రుతి చెబుతుంది.

దాంతో షాక్ అయిన వాళ్లిద్దరు నిజంగా ఇది నిజమా అని అంటారు. దాంతో రాజు, రాజ్ అచ్చం ఒకేలా ఉంటారని ఫొటో చూపిస్తుంది శ్రుతి.

రేఖకు తెలిస్తే ప్రమాదం

రాజ్ ఫొటో చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. మరి ఎలా తప్పిపోయాడని చలపతి అడుగుతాడు. శ్రీశైలం వెళ్తుంటే బస్ ప్రమాదం జరిగింది. అప్పుడే ఆ బాబు బయట పడినట్లు ఉన్నాడు. ఆ దేవుడే బాబును కాపాడాడు. రాజుకు తన గతం గుర్తుందా అని శ్రుతి అడుగుతుంది. లేదు. వాడి కన్నవాళ్ల గురించి చాలా ఎంక్వైరీ చేశాం. కానీ లాభం లేదు. ఇక వాడిని మా కన్నబిడ్డలానే పెంచామని చలపతి అంటాడు.

మంచి పని చేశారు. రాజు బతికి ఉన్నాడని ఆ రేఖకు తెలిస్తే అతని ప్రాణాలకే ప్రమాదం. రేఖ వాళ్ల అమ్మ రుద్రాణి రాజ్ ఫ్యామిలీని చంపించి ఉంటుందని బయట కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆస్తి కోసం ఆ రేఖ చేయని అరాచకం లేదు. ఇప్పుడు రాజు గురించి తెలిస్తే కొత్తగా వారసుడు పుట్టుకొచ్చాడని చంపేస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పకండి. మీ కొడుకు లాగానే రాజును పెంచండి. మీ మౌనమే రాజుకు శ్రీరామ రక్ష అని శ్రుతి చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు ఐశ్వర్యను రాజ్ కలుస్తాడు. తన డబ్బులు రూ. 10 లక్షలు అడుగుతుంది. నేను ఇప్పుడు ఇవ్వలేను. నా దగ్గర లేవని, నేనే ఖర్చు పెట్టేసుకున్నా అని రాజు అంటాడు. నా డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని ఐశ్వర్య బెదిరిస్తుంది. మనం చేసింది బిజినెస్ కాదు, కిడ్నాప్, కంప్లైంట్ ఇస్తే దొరికేది నువ్వే అని రాజు అంటాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని ఐశ్వర్య దబాయిస్తుంది.

ఐశ్వర్యకు హ్యాండ్ ఇచ్చిన రాజ్

నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ, నాకు కాస్తా టైమ్ ఇస్తే డబ్బిస్తాను. ఇలా గొడవ చేస్తే మాత్రం నీ డబ్బులు నీకు రావు తర్వాత నీ ఇష్టం అని రాజు గట్టిగా చెబుతాడు. ఛ.. మిమ్మల్ని నమ్మాను చూడు నన్ను నేను అనుకోవాలి. నా డబ్బులు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని వెళ్లిపోతుంది ఐశ్వర్య. అంత డబ్బు ఏం చేశావురా అని లక్కీ అడుగుతాడు. అవసరం ఉండి వాడుకున్నా అని చెప్పానుగారా అని రాజు కోప్పడి వెళ్లిపోతాడు.

మరోవైపు అపర్ణ ఇంటికి లాయర్ వస్తాడు. ఇందును పిలిచి వేలిముద్ర వేయమంటుంది రేఖ. ఇందు వచ్చి వేలిముద్ర వేసేందుకు రెడీ అవుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి వద్దని వారిస్తుంది. రేఖ మాటలు పట్టించుకోవద్దని, ఆస్తి వీళ్ల చేతిలో పెడితే పిచ్చివాడికి రాయి ఇచ్చినట్లే అని అపర్ణ అంటే.. ఇందుకు నేనేంటో బాగా తెలుసు అని రేఖ అంటుంది.

నానమ్మ నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అని ఇందు ఆస్తి పేపర్స్ మీద వేలిముద్ర వేస్తుంది. అంతా కరెక్ట్‌గానే వేసిందని చెప్పి లాయర్ పేపర్స్ ఇస్తాడు. అవి చూసి ఇచ్చిన మాట ప్రకారం సంతకం చేశావ్, థ్యాంక్స్ అని ఇందుకు చెబుతుంది రేఖ. ఇప్పుడు నాకే కాదు నా కూతురికి కూడా నగలు చేయించాలని భ్రమరాంబ, అప్పులన్నీ తీర్చాలని భూషణ్, కాస్ట్‌లీ కారు కొనుక్కోవాలని శేషు అంటారు.

ఇందును తిట్టిన అపర్ణ

ఇకనుంచి అన్నీ నేను చూసుకుంటానని రేఖ అంటుంది. ఇదే కరెక్ట్ టైమ్ పది లక్షలు అడుగుదామని ఐశ్వర్య అనుకుంటుంది. ఇంతలో భ్రమరాంబ ఆస్తి మొత్తం ఇక మన చేతుల్లోకి వచ్చినట్లేగా అని అడిగితే.. రాలేదని రేఖ చెబుతుంది. ఇందు వేలిముద్ర వేసిన ఈ డాక్యుమెంట్స్‌తో మన కంపెనీ లీగల్ అడ్వైజర్స్‌ను కలవాలి. ఆస్తి మొత్తం మన పేరు మీదకు షిఫ్ట్ చేయించాలి. అప్పుడు మన పేరు మీదకు ఆస్తి వస్తుందని రేఖ అంటుంది.

డాక్యుమెంట్స్ మీద వేలిముద్ర ఎందుకు వేశావని ఇందును తిడుతుంది అపర్ణ. ఇక వాళ్ల దగ్గర బానిసలా నువ్వు బతకాలి అని అపర్ణ అంటుంది. వాళ్ల బెదిరింపులకు ఎందుకు భయపడిపోయావని సుభాష్ అంటాడు. నాకెందుకో నువ్వు తప్పు చేశావనిపిస్తుందని స్వాతి అంటుంది. నేను ఏ తప్పు చేయలేదు. ఆస్తి వాళ్ల పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అవ్వదు. నా పేరు మీదే ఆస్తి ఉంటుంది. ఎందుకంటే నేను వేసిన వేలిముద్ర చెల్లదు కాబట్టి అని ఇందు చెబుతుంది.

దాంతో సుభాష్, అపర్ణ, స్వాతి షాక్ అవుతారు. మరోవైపు లీగల్ అడ్వైజర్‌ లాయర్‌ను కలిసి పేపర్స్ చూపిస్తారు రేఖ, భూషణ్. అవి చూసిన లాయర్ నో, ఆస్తి మీ పేరు మీద రాదు. కోర్టు ఒప్పుకోదు అని అంటాడు. అంతా క్లియర్‌గానే ఉంది, ఎందుకు చెల్లదని, ఇందునే స్వయంగా వేలిముద్ర వేసింది. కావాలంటే తనతోనే చెప్పిస్తామని రేఖ, భూషణ్ అంటారు. ఇందు నా ముందే వేలిముద్ర వేసిన చెల్లదని లాయర్ అంటాడు.

వీలునామా మార్చిన రాజ్, కావ్య

ఎందుకు చెల్లదు, సమస్య ఏంటని కంగారుగా, భయపడుతూ అడుగుతారు రేఖ, భూషణ్. ఎందుకంటే ఇందుకు పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్లి అయిన తర్వాతే ఇందుకు పవర్స్ వస్తాయి. అప్పుడే కోర్టు ఒప్పుకుంటుంది. రాజ్, కావ్య గారు యాక్సిడెంట్‌లో చనిపోడానికి ముందు రోజు నన్ను కలిశారని, వీలునామా మార్పించారని జరిగింది చెబుతాడు లాయర్.

నా భార్య పేరు మీదున్న ఆస్తి నా కూతురు పేరుమీదకు వస్తుందిగా. అలా కాకుండా నా కూతురుకు పెళ్లి అయిన తర్వాతే ఆస్తి తన పేరు మీదకు వెళ్లేలా వీలునామా రాయించండి అని రాజ్, కావ్య అంటారు. అలా ఎందుకు అని లాయర్ అడిగితే.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. రేపు కూడా మేము ఉంటామో లేదో తెలియదు. పసి వయసులోనే ఈ ఆస్తి ఉంటే తనకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. తను కూడా తప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అని రాజ్, కావ్య చెబుతారు.

మరి పెళ్లాయ్యాకే ఎందుకు అని లాయర్ అడుగుతాడు. 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేస్తారు. అప్పుడు తన ఆలోచన స్థాయి మారుతుంటుంది. ఎవరు ఏంటో తెలుస్తుంది. వచ్చే భాగస్వామి తోడు కూడా ఉంటుంది. పెళ్లికి ముందు ఆస్తి ఉంటే దానికోసమే వస్తాడు. అదే పెళ్లి అయ్యాక వస్తే ప్రేమించే మనిషి వస్తాడని రాజ్ చెబుతాడు. మీ ఆలోచన బాగుంది. దాని ప్రకారమే వీలునామా రాయండి అని లాయర్ అంటాడు.

ఇందుకు పెళ్లి

అదే వీలునామాను రేఖ, భూషణ్‌లకు చూపిస్తాడు లాయర్. అలా ఇందుకు పెళ్ల అనే మెలిక పెట్టి వీలునామా మార్చి రాయించిన రాజ్, కావ్యలకు తమకు తెలియకుండానే రేఖకు దిమ్మతిరిగే షాక్ ఇస్తారు. దాంతో ఇందుకు పెళ్లి చేయాలని ఇంటికి పంతులును పిలిపిస్తారు. ఇందుకు పెళ్లి చేస్తున్నట్లు అపర్ణతో చెబుతుంది రేఖ. దాంతో ఇందు, అపర్ణ షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu