మన దేశంలో ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ (హెల్త్ కాన్షియస్) పెరిగిన చాలా మంది తెల్ల చక్కెర (వైట్ షుగర్)కు బదులుగా బ్రౌన్ షుగర్‌ను వాడటం అలవాటు చేసుకున్నారు.
బ్రౌన్ షుగర్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యతో బాధపడేవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు బ్రౌన్ షుగర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ నమ్మకంలో ఎంతవరకు నిజముంది? తెల్ల చక్కెర కంటే బ్రౌన్ షుగర్ నిజంగానే ఉత్తమమైనదా?
దీనిపై ప్రముఖ ఫ్రెంచ్ బయోకెమిస్ట్, 'న్యూయార్క్ టైమ్స్' బెస్ట్ సెల్లింగ్ ఆథర్ జెస్సీ ఇంచౌస్ప్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బ్రౌన్ షుగర్‌కు, వైట్ షుగర్‌కు పోషకాల పరంగా ఎలాంటి తేడా లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదంతా కేవలం కంపెనీల మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.
"తెల్ల చక్కెర కంటే బ్రౌన్ షుగర్ మీ ఆరోగ్యానికి ఏ రకంగానూ మేలు చేయదు. మీరు గ్లూకోజ్ మానిటర్‌లో చూస్తే, ఈ రెండు రకాల చక్కెరలు కూడా మీ శరీరంలో ఒకే రకమైన షుగర్ స్పైక్‌ను (రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగడం) కలిగిస్తాయి. మీరు వీటిలోని పోషకాలను గమనిస్తే, రెండూ ఒకేలా ఉంటాయి" అని జెస్సీ ఇంచౌస్ప్ వివరించారు.
మరి బ్రౌన్ షుగర్‌కు ఆ గోధుమ రంగు ఎలా వస్తుంది? అందులో ఏవైనా ప్రత్యేక పోషకాలు ఉంటాయా? అనే సందేహాలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. చక్కెరను ప్రాసెస్ చేసే సమయంలో దానికి 'మొలాసిస్' (చెరకు రసం నుంచి చక్కెరను వేరు చేసినప్పుడు వచ్చే నల్లటి జిగట పదార్థం) కలపడం వల్లే దానికి ఆ రంగు వస్తుందని ఆమె తెలిపారు. అలా చేయడం వల్ల అది చూడటానికి మరింత సహజంగా, ఆరోగ్యకరంగా కనిపిస్తుందని, అందుకే కంపెనీలు అలా చేస్తాయని ఆమె పేర్కొన్నారు.
"ఈ మార్కెటింగ్ మాయాజాలంలో పడకండి. బ్రౌన్ షుగర్ అన్నా, వైట్ షుగర్ అన్నా రెండూ ఒక్కటే. రెండింటి వల్ల శరీరానికి కలిగే నష్టం ఒకేలా ఉంటుంది" అని జెస్సీ గట్టిగా హెచ్చరించారు.
మీరు మీ రుచి ప్రాధాన్యతలను బట్టి వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. కానీ బ్రౌన్ షుగర్ తింటున్నాం కదా అని ఎక్కువగా తింటే మాత్రం అనారోగ్యం తప్పదు. ఆరోగ్యకరమైన మార్పు అనేది మనం ఎలాంటి చక్కెర తింటున్నాం అనే దానిపై కాకుండా, మనం చక్కెరను ఎలా, ఎప్పుడు తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆమె గుర్తు చేశారు.
షుగర్ స్పైక్స్‌ను నియంత్రించడం ఎలా?
మనం ఏ చక్కెర తిన్నా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి కాబట్టి, కొన్ని చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ గ్లూకోజ్ స్పైక్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చని జెస్సీ సూచించారు. చక్కెర పదార్థాలు తినడానికి ముందు పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే ఏదైనా స్వీట్ తినే ముందు కొద్దిగా వెనిగర్ తాగడం వల్ల గ్లూకోజ్ స్పైక్స్ తగ్గుతాయని తెలిపారు. ఇక చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ త్వరగా ఖర్చవుతుందని ఆమె సూచించారు.
(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.)
HT Telugu Desk

