Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు

చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘరోమైన రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను తీవ్రంగా ఢీకొట్టడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.

మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. చిలకలూరిపేట పరిసర ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ టర్న్ తీసుకోవడం వల్ల, వెనుక నుంచి వేగంగా వస్తున్న బస్సు అదుపు చేయలేక ఆటోను బలంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.

ఈ ఘోర ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబుతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారు. వీరంతా పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాలోని కొండమంజులూరుకు వెళ్లి, తిరిగి తమ స్వగ్రామమైన వేలూరుకు ఆటోలో వస్తుండగా మార్గమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 10 మందిని తక్షణమే మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఒకే ప్రమాదంలో మరణించడంతో వేలూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Anand Sai, Chilakaluripet

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu