ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులందరూ ఆ ఆంజనేయుడి నామ స్మరణలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ అద్భుతమైన వీడియో తెగ వైరల్ గా మారింది.
చిరంజీవి ఇంట్లోని హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్న అద్భుతమైన దృశ్యాన్ని మెగాస్టార్ పంచుకున్నారు.
హనుమంతుడి వీడియో
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2) చిరంజీవి ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో చిరంజీవి ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతున్నాయి. విగ్రహం పైనుంచి కింది వరకూ సూర్య కిరణాలు ప్రసరించడం క్లియర్ గా కనిపించింది.
చిరంజీవి పోస్టు
మెగాస్టార్ చిరంజీవి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ''అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్'' అనే క్యాప్షన్ తో చిరంజీవి వీడియో పోస్టు చేశారు.
సప్త వర్ణాలుగా మారి
''శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా మా పూజ మందిరంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజ మందిరంలో ఉన్న హనుమంతుణ్ని పై నుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే.. ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్య కాంతి ప్రసరించి మెరిసే అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవిల్లి దేవాయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందిరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పవిత్రమైన హనుమజ్జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు'' అని ఆ వీడియోలో చిరంజీవి పేర్కొన్నారు.
దైవ భక్తి
మెగాస్టార్ చిరంజీవికి దైవభక్తి ఎక్కువే అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్ల ఇలవేల్పు ఆంజనేయుడికి మరింత భక్తితో ఆరాధిస్తారు. అందుకే తన కొడుకుకు కూడా రామ్ చరణ్ అని ఆ హనుమంతుడి పేరు వచ్చేలా పేరు పెట్టుకున్నారు. ప్రతి సందర్భంలోనూ ఆ వాయు పుత్రుడిని చిరంజీవి తలుచుకుంటూనే ఉంటారు.
Chandu Shanigarapu

