Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Crime news : దారుణం! స్కూల్​లోనే ఉపాధ్యాయురాలి హత్య- 40 సెకన్లలో 25సార్లు కత్తితో పొడిచి..

Crime news : దారుణం! స్కూల్​లోనే ఉపాధ్యాయురాలి హత్య- 40 సెకన్లలో 25సార్లు కత్తితో పొడిచి..

రియాణాలోని ఫరీదాబాద్‌లో ఊహించని దారుణ సంఘటన వెలుగుచూసింది! తరగతి గదిలో విద్యార్థులకు చదువు చెబుతున్న ఒక ఉపాధ్యాయురాలిని.. ఓ వ్యక్తి బయటకు లాగి, విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు.

అసలేం జరిగింది?

ఈ పాశవిక ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సిక్రోనా ప్రాంతంలోని సరస్వతి సీనియర్ సెకండరీ పాఠశాలలో 30 ఏళ్ల సంధ్యా కర్హానా రెండో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఆమె ఫిరోజ్‌పూర్ కలాన్ నివాసి కాగా, ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆమె పాఠశాలకు చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.

ఉదయం 9:35 గంటల సమయంలో తెల్లటి గుడ్డను ముఖానికి కట్టుకున్న ఒక వ్యక్తి పాఠశాల ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చాడు. ఆ సమయంలో గేటు వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో నిందితుడు సులభంగా లోపలికి అడుగుపెట్టాడు.

భర్త పేరు చెప్పి బయటకు పిలిపించి..

పాఠశాల ఆవరణలోకి వచ్చిన నిందితుడు.. అక్కడ ఉన్న ఇద్దరు విద్యార్థులు, ఒక సిబ్బందిని కలిశాడు. సంధ్య భర్త పేరును నేరుగా ప్రస్తావిస్తూ, ఆయన కలవడానికి బయట వేచి ఉన్నారని చెప్పి సంధ్యను బయటకు పిలవాలని కోరాడు.

సంధ్య బయటకు రాగానే నిందితుడు కేవలం 30 నుంచి 40 సెకన్ల వ్యవధిలోనే ఆమె మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కనీసం 25 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఈ దారుణమంతా పాఠశాల సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది.

ఆ సమయంలో పాఠశాలలో 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 300 నుంచి 350 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరు విద్యార్థులు తరగతి గదుల కిటికీల నుంచే ఈ భయానక దృశ్యాన్ని కళ్లారా చూశారు.

అడ్డుకోబోయిన డైరెక్టర్‌పైకి కత్తితో..!

కేకలు వినబడటంతో పాఠశాల డైరెక్టర్ తేజ్‌పాల్ శర్మ వెంటనే తన కార్యాలయం నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు.

"వర్షం పడటం వల్ల ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టిందేమోనని మొదట అనుకున్నాను. బయటకు వచ్చి చూసేసరికి ఒక వ్యక్తి సంధ్యను పదే పదే కత్తితో పొడుస్తూ కనిపించాడు," అని తేజ్‌పాల్ శర్మ మీడియాకు తెలిపారు.

ఆయన దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆయనపైకి కూడా కత్తితో విరుచుకుపడ్డాడు. టీచర్​ని రక్షించుకోవడానికి కర్ర కోసం లోపలికి వెళ్లి కేకలు వేస్తూ తిరిగి వచ్చేలోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని శర్మ వివరించారు. తీవ్ర గాయాలతో ఉన్న సంధ్యను వెంటనే అల్-ఫలా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

రక్తపు మరకల దుస్తులతోనే అరెస్ట్!

ఈ ఘటనపై సెక్టార్ 58 పోలీస్ స్టేషన్‌లో బీఎన్​ఎస్ సెక్షన్ 103(1) (హత్య) కింద కేసు నమోదైంది. క్రైమ్ బ్రాంచ్ బృందాలు వేగంగా రంగంలోకి దిగి, ఉదయం 11:30 గంటలకల్లా నిందితుడిని అరెస్ట్ చేశాయి.

"హత్య చేసిన తర్వాత నిందితుడు తన ఒంటిపై ఉన్న రక్తపు మరకల దుస్తులను కూడా మార్చుకోలేదు. దాడికి కొద్ది క్షణాల ముందు అతడు శరీరాన్ని సాగదీస్తూ (స్ట్రెచింగ్) సిద్ధపడిన తీరు చూస్తుంటే, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని స్పష్టమవుతోంది," అని ఫరీదాబాద్ పోలీస్ అధికార ప్రతినిధి యశ్‌పాల్ యాదవ్ తెలిపారు.

వేధింపులే కారణం!

నిందితుడిని కోట్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అమిత్‌గా పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం సంధ్య ఆ గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు అమిత్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడు ఆమెను నిరంతరం వేధించడం మొదలుపెట్టాడు. దీనితో ఆమె అతడితో సంబంధాలు తెంచుకుని, వేధింపులు మానకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఇటీవల తీవ్రంగా హెచ్చరించింది.

గత కొన్ని నెలలుగా నిందితుడు తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడని సంధ్య భర్త కూడా పోలీసులకు తెలిపారు.

నిందితుడిని కస్టడీకి తీసుకుని మరింత విచారించేందుకు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు పోస్టుమార్టం అనంతరం సంధ్య మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu