ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సీక్వెల్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద కనివిని ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే పార్ట్-1 లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం ఈ చిత్రం ఇండియాలో రూ.900 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,400 కోట్లకు పైగా వసూలు చేసి గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సంజయ్ దత్
ధురంధర్ సినిమాల్లో సంజయ్ దత్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. పాకిస్థాన్ లోని కరాచీ ఎస్పీ చౌదరి అస్లాం పాత్రను సంజయ్ దత్ పోషించాడు. చౌదరి అస్లాం ఇప్పటికే మరణించాడు. అయితే సంజయ్ దత్ ఈ చిత్రంలో పాకిస్థాన్ పోలీస్ ఆఫీసర్ చౌదరి అస్లాం పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తన భర్తలాగే
ధురంధర్ సినిమాల్లో తన భర్త క్యారెక్టర్ పోషించిన సంజయ్ దత్ గురించి చౌదరి అస్లాం భార్య నౌరీన్ షాకింగ్ కామెంట్లు చేసింది. తాజాగా ఆజ్ తక్ రేడియో పోడ్ కాస్ట్‌లో అస్లాం భార్య నౌరీన్ మాట్లాడుతూ.. ''సంజయ్ దత్ తన భర్త పాత్రకు నిండుదనం తెచ్చారు. ఒక సీన్ లో సంజయ్ దత్ కారు దగ్గర నిలబడి కళ్ళు ఎత్తినప్పుడు, తన భర్తనే చూస్తున్నట్లు అనిపించింది'' అని ఆమె చెప్పింది.
నౌరీన్ విమర్శలు
సంజయ్ దత్ నటన బాగున్నా, తన భర్త వ్యక్తిత్వంలోని లోతును ఈ చిత్రం పూర్తిగా చూపించలేదని నౌరీన్ విమర్శించింది. సినిమా తీసే ముందు తనను లేదా తోటి పోలీసులను సంప్రదించి ఉంటే అస్లాంలోని పాజిటివ్, నెగెటివ్ యాంగిల్స్ ను ఇంకా బాగా వివరించేవారమని ఆమె పేర్కొంది.
పోలీస్ లాంగ్వేజ్
పోలీస్ గా ధురంధర్ సినిమాల్లో సంజయ్ దత్ వాడిన భాష హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమాలో వాడిన అసభ్యకర భాష పోలీసు వర్గాల్లో సహజమేనని, అది పాత్రకు బాగా సెట్ అయిందని నౌరీన్ పేర్కొనడం గమనార్హం. ధురంధర్ సినిమాల్లో బూతులున్నాయనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ధురంధర్ గురించి
రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ చిత్రాలు 26/11 దాడుల ప్రతీకారం నేపథ్యంలో సాగుతాయి. హమ్జా లియారీ అనే వ్యక్తి రాజకీయాల్లో ఎదగడం, రహస్య మిషన్ పూర్తి చేయడమే ప్రధానాంశం. రణ్‌వీర్ సింగ్ స్పై క్యారెక్టర్లో అదరగొట్టాడు.
Chandu Shanigarapu

